పట్టణానికి పట్టం !
* మూడంచెల వ్యూహంతో తుమ్మల కమిటీ నివేదిక
* అభివృద్ధికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పన
* ఏడాదిలో పూర్తయ్యే పనులకు రూ. 565.35 కోట్లు అవసరమని అంచనా
* రూ.126 కోట్లతో మున్సిపాలిటీలకు కొత్త వాహనాలు
* లక్షకుపైగా జనాభాగల 8 పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
* ఏక రూప నమూనాలతో మార్కెట్లు, శ్మశానాలు, కార్యాలయ భవనాల నిర్మాణం
‘చెత్త’కు పర్యాయపదంగా మారిన పురపాలక సంస్థలను గాడిలో పెట్టి.. అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అనుసరించనుంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, జంక్షన్ల విస్తరణ నుంచి మున్సిపల్ ఉద్యోగులకు ఏకీకృత సర్వీసు రూల్స్ దాకా వివిధ అంశాల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. పురజనులకు సౌకర్యాల కోసం చేయాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి.. మూడు నెలలు, ఏడాది, ఐదేళ్ల వ్యవధిలో పూర్తిచేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను చేపట్టాలని సూచించింది.
కొత్త ఒరవడికి ప్రణాళిక..
పురపాలన, పట్టణాభివృద్ధి అంశాలపై అధ్యయనం కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలో మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి టి.శ్రీనివాస్‌గౌడ్‌లతో గత నెల 14న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ... తాజాగా ప్రభుత్వానికి అధ్యయన నివేదికను సమర్పించింది. పురపాలనలో మూస విధానాలకు స్వస్తి పలుకుతూ... కొత్త ఒరవడిని సృష్టించేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలు, నిధులు, నిధుల సమీకరణ మార్గాలు, కాలం చెల్లిన పురపాలక చట్టాలకు సవరణలు తదితర అంశాలను తమ నివేదికలో క్రోడీకరించింది. ఏడాదిలోపు వ్యవధిలో అమలుచేయాల్సిన స్వల్ప కాలిక ప్రణాళికల కోసం రూ. 565.35 కోట్లు అవసరమని తేల్చింది. ఒకటి నుంచి ఐదేళ్ల వ్యవధిలో అమలుచేయాల్సిన మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలకు అయ్యే వ్యయాన్ని తేల్చేందుకు అధ్యయనం జరపాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది.
స్వల్పకాలిక ప్రణాళికలు
వేసవి వస్తే పలు పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోంది. నీటి సరఫరా పథకాల మరమ్మతుల కోసం రూ. 21.16 కోట్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం రూ. 15.22 కోట్లు కేటాయించాలి. మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు జంక్షన్ల అభివృద్ధి కోసం రూ. 25 లక్షలు, మున్సిపాలిటీల్లో మూడు జంక్షన్ల అభివృద్ధి కోసం రూ. 10 లక్షలు చొప్పన మొత్తం రూ.7.55 కోట్లు కేటాయించాలి.
మౌలిక వసతుల అభివృద్ధిపై కమిటీ సూచనలు
మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు
- నీటి సరఫరా పరిమాణాన్ని మున్సిపాలిటీల్లో రోజుకు ఒక్కొక్కరికి 60 లీటర్ల నుంచి 135 లీటర్లకు, కార్పొరేషన్లలో 100 నుంచి 150 లీటర్లకు పెంచాలి. నీటి సరఫరా నిర్వహణ, అమలు వ్యయాన్ని తగ్గించుకొంటూనే... మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే విధంగా నీటి చార్జీలు నిర్ణయించాలి.
- మున్సిపాలిటీల్లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు లక్షకుపైగా జనాభా గల పట్టణాలకు రవాణా ప్రణాళికలను తయారుచేయాలి. సీఎం హామీ మేరకు 5 మున్సిపాలిటీలకు రింగ్‌రోడ్లను నిర్మించాలి.
- లక్షకు పైగా జనాభా గల 8 నగరాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి. వర్షాకాలంలో నీరంతా వెళ్లిపోయేలాగా డ్రైనేజీల వ్యవస్థను బాగు చేయాలి. నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణ, తరలింపు కోసం రూ. 126.87 కోట్లతో పరికరాలు/వాహనాలను కొనుగోలు చేయాలి.
సామాజిక సౌకర్యాలు
స్వల్పకాలిక ప్రణాళికలు(ఏ)
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లోని 3,34,630 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు వ్యయంగా నిర్ణయించగా... కేంద్రం రూ. 4 వేల చొప్పున ఇస్తోంది. మిగతా రూ. 11 వేలలో లబ్ధిదారువాటా రూ. 3 వేలుపోగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 వేలు చెల్లించాలి. దీనికి నాలుగేళ్లలో రూ. 267.70 కోట్లను కేటాయించాలి. రూ. 51.8 కోట్లతో 1,038 సామూహిక మరుగుదొడ్లను నిర్మించాలి.
- రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 18 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం లో మార్కెట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 10 లక్షల మీటర్లకే పరిమితమయ్యాయి. ఈ మార్కెట్ల ఆధునీకీకరణ కోసం రూ. 108 కోట్లు అవసరం. ఇక పట్టణాల్లో 112 జంతు వధశాలలు నిర్మించాల్సి ఉంది.
- కబ్జాలు, సౌకర్యాల లేమితో పట్టణ ప్రాంత శ్మశాన వాటికలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిలో సౌకర్యాల కోసం లక్షలోపు జనాభా గల పట్టణాలకు రూ. 15 లక్ష లు, లక్షపైన జనాభా గల పట్టణాలకు రూ. 25 లక్షల చొప్పున మొత్తంగా రూ. 11.30 కోట్లు ఇవ్వాలి. కొత్త శ్మశానాల నిర్మాణం కోసం రూ. 71.70 కోట్లు కేటాయించాలి.
- కొత్తగా ఏర్పడిన 25 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ. 2 కోట్లు చొప్పున రూ.50 కోట్లు కేటాయించాలి. ఇక రాష్ట్రం లోని మున్సిపాలిటీల్లో 1,949 ఖాళీ స్థలాలు ఉండగా.. 1,448 స్థలాలకు రక్షణ లేదు. వాటికి ప్రహరీ గోడలను నిర్మించేందుకు రూ.60 కోట్లు అవసరంకాగా.. తొలివిడత కింద రూ. 10 కోట్లు ఇవ్వాలి.