మహాత్మా.. మా గోడు విను!
‘‘ఐదేళ్లుగా మాకు గణితం బోధించే ఉపాధ్యాయుడు లేడు.. ఖాళీని భర్తీ చేయాలని అధికారులను ఎన్ని సార్లు కోరినా ఫలితం లేదు.. ఓ మహాత్మా.. నువ్వైనా మా గోడు విను’’.. అంటూ రేగోడ్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందించారు జగిర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. - రేగోడ్
పాఠశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని జగార్యాల హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 6నుంచి 10వ తరగతి వరకు 135 మంది విద్యార్థులు ఉన్నారు. టెన్త్‌లో 34 మంది చదువుతున్నారు. 5 తరగతులకు గానూ ఏడుగురు ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. కానీ ఐదేళ్లుగా వీరికి లెక్కలు బోధించే ఉపాధ్యాయుడే లేడు. అయినా ఈ పాఠశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులు త్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఇది చూసైనా విద్యాశాఖ అధికారుల్లో చలనం లేకుండా పోయిందని విద్యాకమిటీ చైర్మన్ యాదుల్లా మండిపడ్డారు.
స్కూల్‌లో గణితం బోధించే ఉపాధ్యాయుడిని నియమించాలని పలు మార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. మ్యాథ్స్ టీచర్ లేకపోవడంతో టెన్త్ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ గత నెల 27న విద్యార్థులు తరగతులను కూడా బహిష్కరించారు. అయినా అధికారుల్లో మార్పు లేదు. దీంతో ఆవేదనకు గురైన విద్యార్థులు శుక్రవారం జగిర్యాల నుంచి కాలినడకన రేగోడ్‌కు చేరుకున్నారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి.. గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం ర్యాలీ గా వెళ్లి కొద్దిసేపు ప్రభుత్వ ఆస్పత్రి మూల మలుపు రోడ్డుపై ఆందోళన చేశారు. ఎంఆర్‌సీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు ఉపాధ్యాయుడిని నియమించాలంటూ నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రాచకొండ రవీందర్ ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి సమస్యకు గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావ్‌తో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల సమస్యను వివరించారు. జగిర్యాల పాఠశాలలో గణితశాస్త్రం ఉపాధ్యాయుడిని వెంటనే నియమిస్తామని డీఈఓ తెలిపినట్లు ఎస్‌ఐ విద్యార్థులతో చెప్పారు. దీంతో శాంతించిన విద్యార్థులు ఎస్‌ఐకి కృతజ్ఞతలు తెలిపి తిరిగివెళ్లారు.