తక్షణమే నిలిపివేయాలని టీచర్ల ఆందోళన
గతం కంటే ఇప్పుడే పని ఒత్తిడి అధికమైందని మండిపాటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఇస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) రెసిడెన్షియల్ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఆగిరిపల్లిలో శిక్షణ కోసం వచ్చిన ఉపా«ద్యాయుడు మృతి చెందడం, చీరాలలో మరో ఉపాధ్యాయుడు అస్వస్తతకు గురవడంతో ఈ శిక్షణను పూర్తిగా బహిష్కరించాలని భావిస్తున్నాయి.
ఉపాధ్యాయులపై ఉన్న భారాన్ని తొలగిస్తామని, యాప్స్, శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, కానీ గతం కంటే ఇప్పుడు పని ఒత్తిడి అధికంగా పెంచారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలన్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్య డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసి తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
విద్యా ప్రమాణాల పెంపునకు శిక్షణ
విద్యాబోధనలో ప్రమాణాలు పెంచాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఉండాలని జాతీయ విద్యా విధానానికి, నిపుణ్ భారత్ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణను ప్రారంభించింది. ఈ శిక్షణ ద్వారా 1, 2 తరగతులపై దృష్టి సారించి, 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందచడమే లక్ష్యంగా కోర్సుకు రూపకల్పన చేశారు. మొత్తం 34 వేల మంది గ్రేడ్–1, 2 కేటగిరీ ఉపాధ్యాయులకు 14 విడతల్లో ఈ శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది కూడా ఇదే తరహా శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో దాదాపు 4 వేల మందికి, ఈ ఏడాది తొలివిడత 1,700 మందికి శిక్షణ ఇచ్చారు.
అయితే, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. గతేడాది పిల్లలను బడిలో చేర్పించడం, బడి బయటి పిల్లలను సర్వే చేయడం, వారిని బడికి తీసుకొచ్చే బాధ్యతను వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చేరికల కోసం ఇంటింటి సర్వే ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చింది. దీంతోపాటు పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సిద్ధం చేయడం, కొత్తగా అపార్ ఐడీల నమోదు వంటి అదనపు భారం తమపై పడిందని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment