సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రత్యేక పరీక్ష వ్యవహారంలో ప్రైవేటు వైద్య కళాశాలలపై సర్కారు కొరడా ఝుళిపించింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే ప్రత్యేక ప్రవేశ పరీక్ష (ఎం-సెట్)కు కన్వీనర్ ఎంపిక, నోటిఫికేషన్ జారీ చేయడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కనీసం తనకు కూడా సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’లో మూడు రోజులుగా ప్రచురితమైన కథనాలు రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించాయి. సీఎం కేసీఆర్ కూడా ప్రైవేటు కళాశాలల తీరుపై, నోటిఫికేషన్ ఇచ్చిన పద్ధతిపై ఆరా తీసినట్లు సమాచారం.
దీంతో సీఎం ఆదేశాల మేరకు మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం పలు చర్యలు చేపట్టారు. ప్రైవేటు వైద్య కాలేజీల యాజమాన్యాలను పిలిపించి మందలించారు. విచిత్రమేమిటంటే మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు రావడంతో... కాలేజీల యాజమాన్యాలు మంత్రి వద్దకు వచ్చి ‘ఇతనే మా క న్వీనర్’ అంటూ రాజేంద్రప్రసాద్‌ను పరిచయం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి, దానికి ఆమోదం తెలపాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డితో చర్చించి.. ఓ నిర్ణయానికి వచ్చారు. తాము సూచించిన స్వచ్ఛంద సంస్థకే ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ బాధ్యతలు అప్పగించాలన్న ప్రైవేటు వైద్య కాలేజీల విజ్ఞప్తిని మంత్రి తిరస్కరించారు.
హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రం తయారీ, సెంట్రలైజ్డ్ సింగిల్ విండో కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని.. ప్రశ్నపత్రం ఎంపిక బాధ్యతను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో చేపడతామని చెప్పారు. పరీక్ష పర్యవేక్షణ బాధ్యతను కూడా ఉన్నత విద్యా మండలి చేపడుతుంది. ఇక ‘ప్రైవేటు’ ఎం-సెట్ దరఖాస్తులకు ఈనెల 28 చివరి తేదీగా పేర్కొన్నా.. దానిని పొడిగించాలని, పరీక్ష తేదీని మార్చాలని సర్కారు ఆదేశించింది. అయితే వైద్య విద్యా మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రవేశ పరీక్షకు ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా 3,200 దరఖాస్తులు వచ్చాయి.
‘ప్రైవేటు ఎం-సెట్’పై సర్కారు సీరియస్
Published Wed, May 27 2015 1:25 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement