గ్రామదీపికల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సంక్షేమ విభాగం : గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతంతో పాటు నిరుపేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నిరంతరం కృషి చేస్తున్న గ్రామదీపికల సమస్యలను పరిష్కరించాలని గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్‌కుమార్, జిల్లా ఛైర్మన్ పోలెపొంగు ఆంజనేయులు డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న గ్రామదీపికల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంపత్‌కుమార్ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.
ఇందుకు మద్దతుగా వివిధ మండలాల నుంచి గ్రామదీపికలు తరలొచ్చారు. దీక్ష శిబిరం వద్ద సంపత్, ఆంజనేయులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఆవిర్భావం నుంచి ఐకేపీలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామదీపికల విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి వీరి పొట్టగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో చేసిన హామీలకు అనుగుణంగా కనీస వేతనం రూ.5వేలు చెల్లించాలని కోరారు. అదేవిధంగా 20నెలల పాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామదీపికలకు బీమా సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపతే దశలవారీగా ఆందోళన చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామదీపికలకు గ్రామీణ ఉద్యోగుల సంఘం అన్నివిధాలుగా అండగా ఉంటందన్నారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.సీతారాములు, కోశాధికారి జ్యోతి, మహిళా కన్వీనర్ అనురాధ, సత్తుపల్లి ఏరియా బాధ్యుడు విక్టర్‌పాల్, జనార్దన్, జంపాల విష్ణువర్ధన్, కామేపల్లి ఏరియా బాధ్యుడు సోందుసాహెబ్, మధిర ఏరియా బాధ్యుడు కృష్ణయ్య, ముదిగొండ ఏరియా బాధ్యుడు అజయ్‌బాబు, రామారావు, టీఎన్‌జీవోస్ జిల్లా కార్యదర్శి రామయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖాజామియా, గ్రామదీపికల నాయకులు వెంకటరామమ్మ, నాగమణి, రామకృష్ణ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.