ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
భారీ ఏర్పాట్లు చేస్తున్న సర్కారు
జూన్ 2 నుంచి 7 వరకు కార్యక్రమాలు
హైదరాబాద్: జూన్ 2 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని 30 ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదు బృందాలను నియమించింది. ప్రత్యేకంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. జూన్ 2న గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళితో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వివిధ రంగాల వారికి అవార్డుల ప్రదానం, 20 విభాగాలకు చెందిన శకటాల ప్రదర్శన, సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఇక 7వ తేదీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కనీవినీ ఎరుగని రీతిలో ముగింపు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక త్రీడీ మ్యాపింగ్ సిస్టం ద్వారా సికింద్రాబాద్ క్లాక్ టవర్, కాచిగూడ రైల్వే స్టేషన్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్దుడి విగ్రహానికి సప్తవర్ణాల్లో మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగులు అమర్చనున్నారు.
మునుపెన్నడూ లేని విధంగా చార్మినార్ వేదికపై అంతర్జాతీయ కళాకారుడితో అద్భుత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే శిల్పారామం, రవీంద్రభారతి, చౌమహల్లా ప్యాలెస్, తారామతి బారాదరి, గోల్కొండ తదితర ప్రాంతాల్లోనూ సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లితిత కళా తోరణంలో 2 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ సినిమాలను ప్రదర్శించనున్నారు. సాంస్కృతిక సారథి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో 500 మంది కళాకారులతో సాంస్కృతిక జైత్రయాత్ర నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు.