
పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క
నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ – 2025 ఆవిష్కరించనున్న సీఎం
మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేలా కొత్త పాలసీ
ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలే లక్ష్యమన్న మంత్రి సీతక్క
నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షమంది మహిళలతో సభ
పలు పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్–2025ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను, ఈ ఏడాది మహిళలు సాధించిన విజయాలను మిషన్‌లో పొందుపరిచారు. కోటి మంది మహిళలను ఎస్‌హేచ్‌జీల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లను విలీనం చేయనున్నారు.
ఈ మిషన్‌కు సబంధించిన పాలసీకి గురువారం రాత్రి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పరేడ్ గ్రౌండ్స్ సభకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు పాల్గొననున్నారు.
ప్రభుత్వాన్ని దీవించండి: మంత్రి సీతక్క
మంత్రి సీతక్క శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘మహిళలకు సైతం సమాన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతోంది. మహిళా సంఘం అంటే ఆర్థిక భద్రత, సామాజిక రక్షణకు నిదర్శనం. అందుకే 60 ఏళ్లు దాటిన వారిని సంఘాల్లో చేర్చుకుంటున్నాం.
మహిళలు చదువు మానేసి అనేక రకాల మానసిక వేదనలకు గురైన సందర్భాలు ఉన్నందున..15 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారికి కూడా సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించాం. సభ్యుల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. మహిళలకు రూ.1200 గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఐకేపీ సెంటర్లు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా రైస్ మిల్లులు నడిపేలా శిక్షణ ఇవ్వబోతున్నాం. సోలార్ విద్యుత్ ప్లాంట్లను అప్పగిస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి అందరి సోదరుడిలా అండగా ఉంటున్నా రు. ఈ ప్రభుత్వాన్ని మహిళలంతా దీవించాలి’ అని కోరారు.
మహిళా సమాఖ్యలకు ఆహ్వనం
పరేడ్ గ్రౌండ్స్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరా మహిళా శక్తి మిషన్–2025 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క ఇప్పటికే ఆహ్వనాలు పంపారు. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) 600కు పైగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది. సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళలంతా అరగంట ముందే సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
దూర ప్రాంతాల నుంచి మహిళలు వస్తుండడంతో ఏడున్నర గంటల లోపే సభను ముగించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పరేడ్ గ్రౌండ్స్ వద్ద అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ నిరంతరాయంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం నుంచి జిల్లా డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులతో వీడియో కాన్ఫరె¯న్స్ నిర్వహించారు.
నేటి కార్యక్రమాలివీ..
⇒ మండల మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం ప్రారంభిస్తారు.
⇒ 31 జిల్లా సమాఖ్యల ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
⇒ మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేస్తారు
⇒ మహిళా సంఘాలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షులకు
అందజేస్తారు.
⇒ జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులకు యునిఫాం చీరలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం, మంత్రులు సందర్శిస్తారు.
ఈ ఏడాది సాధించిన విజయాలు
⇒ మహిళా సంఘాలకు రూ.21,632 కోట్ల రుణాలు
⇒ 2,25,110 సూక్ష్మ, మధ్య తరహా సంస్థల ఏర్పాటు
⇒ రూ.110 కోట్లతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం
⇒ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు
⇒ హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో రూ.9 కోట్లతో మహిళా శక్తి బజార్
⇒ విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే పని ద్వారా మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం
⇒ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు.
Comments
Please login to add a commentAdd a comment