‘గ్రేటర్’ కిక్కు 200 కోట్లు | 'Greater' appreciated 200 crore | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ కిక్కు 200 కోట్లు

Published Sat, Apr 26 2014 5:38 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

‘గ్రేటర్’ కిక్కు 200 కోట్లు - Sakshi

‘గ్రేటర్’ కిక్కు 200 కోట్లు

ఎన్నికల గ‘మ్మత్తు’
 నిరుడి కంటే 50%  రెట్టింపు అమ్మకాలు
 వైన్ షాపుల్లో     మద్యం స్టాకు నిల్
 శివార్లలో ఎక్కడికక్కడే ‘ఫుల్లు’
 తాగినోళ్లకు తాగినంత..
 విందు..వినోదాల జోరు
 హోరెత్తుతున్న అభ్యర్థుల ప్రచారపర్వం
 

సాక్షి, సిటీబ్యూరో : ‘గ్రేటర్’ ఎన్నికల జాతరలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ప్రధాన నగరంతోపాటు శివారు కాలనీలు, బస్తీల్లో మందు, విందులతో ప్రచారపర్వం రసకందాయంలో పడింది. కనీవినీ ఎరుగని రీతిలో అభ్యర్థులు చేస్తున్న ఖర్చులో మద్యంపై చేస్తున్న వ్యయమే అత్యధికంగా ఉండటం గమనార్హం. మార్చి 25 నుంచి ఈ నెల 25 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.200 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ వర్గాలు తెలిపాయంటే లిక్కర్ సేల్స్ కిక్కు ఎలా ఉందో సుస్పష్టమౌతోంది.

ఈసీ డేగకన్ను బారిన పడకుండా ముందుజాగ్రత్త పడిన అభ్యర్థులు మార్చి చివరివారం, ఏప్రిల్ మొదటి వారంలోనే భారీగా మద్యం స్టాకు కొనుగోలు చేసి ఎక్కడికక్కడే ద్వితీయశ్రేణి నాయకగణం ఇళ్లలో, ఫాం హౌస్‌లలో, తమకు అనువుగా ఉండే గోడౌన్లు, షెడ్లలో గుట్టుచప్పుడు కాకుండా స్టాకు నిల్వ చేసినట్లు తెలిసింది. కాగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చిన నేపథ్యంలో మద్యం దొరకని పరిస్థితి ఏర్పడటంతో.. పలువురు లిక్కర్ వ్యాపారులు కొత్తరూటును ఎంచుకుని లాభాలు గడించారు. కోటా దాటిన తరవాత తమపై పడే ప్రివిలేజ్ ఫీజును సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి వసూలు చేసినట్లు సమాచారం.
 
భారీగా మద్యం అమ్మకాలు..!

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 538 మద్యం దుకాణాలు, 475 బార్లలో ఈ నెల 25 నాటికే రూ.200 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఉభయ జిల్లాల పరిధిలో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు లెసైన్స్‌డ్ మద్యం దుకాణ యజమానుల కోటా (ఏడాదికి తాము విక్రయించాల్సిన మద్యం) మార్చి మూడోవారానికేముగిసింది. అంటే రూ.కోటి రూపాయల లెసైన్సు ఫీజు చెల్లించిన మద్యం దుకాణ దారునికి ఏడాదికి రూ.7 కోట్ల విలువైన మద్యం అమ్మాలన్న నిబంధన (కోటా విధానం) అమలవుతోంది.

ఈ కోటా ముగిసిన  తర్వాత మద్యం కొనుగోలు చేస్తే.. దాని విలువలో 15 శాతం ప్రివిలేజ్ పన్ను కింద చెల్లించాలి. దీంతో పలువురు వ్యాపారులు కొత్త మార్గం అన్వేషించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచే 15 శాతం ప్రివిలేజ్ పన్నును వసూలు చేసి నేరుగా ఆబ్కారీ శాఖ గోడౌన్ల నుంచి వారికి మద్యం సరఫరా చేస్తున్నారు. అంటే ప్రివిలేజ్ పన్ను భారం తమపై పడకుండా తెలివిగా తప్పించుకుంటున్నారన్నమాట. అంతేకాదు నేరుగా గోడౌన్ల నుంచి మద్యం ఇప్పించినందుకుగాను అభ్యర్థులతో బేరసారాలకు దిగి అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం.
 
బీర్లకు ‘కట్ ’కట
 
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐఎంఎల్ మద్యం (లిక్కర్) స్టాకు కొరత లేనప్పటికీ పలు మద్యం దుకాణాల్లో అన్ని బ్రాండ్లకు చెందిన బీర్లు లభ్యం కాక బీరుబాబులు నీరసిస్తున్నారు. పలు మద్యం దుకాణాల్లో బీర్ల కోటా ముగియడం, నిర్ణీత కోటా దాటి బీరు కాటన్‌లను సరఫరా చేయడంపై నిషేధం అమలవుతుండటంతో బీర్ల కొరత భారీగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
 
గతేడాది కంటే అధికం
 
గతేడాది మార్చి-ఏప్రిల్ మాసాలతో పోలిస్తే మద్యం అమ్మకాల్లో 50 శాతం వృద్ధి నమోదైనట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలకు మరో నాలుగురోజుల సమయం ఉండటం, ఎన్నికల ఫలితాలు వెలువడే తరుణంలోనూ అమ్మకాల జోరు మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement