సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం సోలార్ సొబగులు సంతరించుకునేందుకుఅవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మహానగరంలో పలు బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవంతులపై సౌరపలకలు (రూఫ్‌టాప్ సోలార్ ఫొటో వోల్టాయిక్ సిస్టమ్స్–ఆర్‌టీపీవీ)ఏర్పాటుతో ఏటా 1,730 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని తేలింది. ఈ విద్యుత్‌తో నగరంలో 15 శాతం విద్యుత్ డిమాండ్‌ను తీర్చవచ్చని తాజా నివేదిక వెల్లడించడం విశేషం. ‘రూఫ్‌టాప్ రివల్యూషన్.. అన్‌లీషింగ్ హైదరాబాద్ సోలార్ పొటెన్షియల్’అంశంపై గ్రీన్‌పీస్ ఇండియా, గుజరాత్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (జీఈఆర్‌ఎంఐ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు 1,193 మెగావాట్ల విద్యుత్‌ను (70 శాతం) జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న భవంతులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పలు భవంతులు, బేగంపేట్, శంషాబాద్ విమానాశ్రయాలు, నగరంలోని ప్రధాన రైల్వే, మెట్రో స్టేషన్లు, ఆర్టీసీ డిపోలు సౌరఫలకాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి.
చ.కి.మీకి 2.7 మెగావాట్లు
మహానగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఆయా భవంతులపై సౌరఫలకల ఏర్పాటు ద్వారా ప్రతి చ.కి.మీకి సరాసరి 2.7 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది. సౌర పలకల ఏర్పాటుతో వాయు కాలుష్యం అసలే ఉండదని, కాలుష్య ఉద్గారాల ఊసే ఉండదని నిపుణులు సైతం అభిప్రాయ పడుతుండడం విశేషం. ఒకసారి సౌరఫలకల ఏర్పాటుకు పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో గృహ వినియోగదారులు సైతం విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరమే ఉండదని స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్‌లో బహుళ ప్రయోజన స్థలాల్లో సాలీనా 231 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని, ఇక బహిరంగ ప్రదేశాలు, సెమీ పబ్లిక్ ప్రాంతాల్లో 178 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తికి అవకాశం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. రవాణా ఆధారిత ప్రాంతాలు, మిలటరీ స్థలాలు సౌర పలకల ఏర్పాటుకు అంతగా అనుకూలంగా లేవని పేర్కొంది. సౌర పలకల ఏర్పాటుతో గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష మందికి నూతనంగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. నగరంలో కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతుందని అధ్యయన నిపుణులు తేల్చారు. గ్రేటర్ పరిధిలో 8,887 భవంతులపై 1,868 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా సౌర పలకలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ అధ్యయనం వెల్లడించడం విశేషం.
సౌరశక్తి ఉత్పత్తికిఅవకాశం ఉన్న ప్రాంతాలు..
చాంద్రాయణగుట్ట, చార్మినార్,సరూర్‌నగర్, మలక్‌పేట్102.22 మెగావాట్లు
జహనుమా, గోషామహల్,ఫలక్‌నుమా 266.64 మెగావాట్లు
కూకట్‌పల్లి 111.98 మెగావాట్లు
శేరిలింగంపల్లి 117.04 మెగావాట్లు
కుత్బుల్లాపూర్ 125.50 మెగావాట్లు
రాజేంద్రనగర్ 121.57 మెగావాట్లు
ఎల్బీనగర్ 205.88 మెగావాట్లు
ఒక మెగావాట్ వెయ్యి కిలోవాట్లకు సమానం. ఈ విద్యుత్ వెయ్యి నివాసాల విద్యుత్ అవసరాలకు సరిపోతుంది.
సౌరశక్తి ఉత్పత్తిలో మెట్రో నగరాల స్థానం (మెగావాట్లలో) ఇలా..
నగరం సౌరశక్తి ఉత్పత్తికి అవకాశం
న్యూఢిల్లీ 2,000
ముంబై 1,720
పట్నా 759
హైదరాబాద్ 1,727
చెన్నై 1,385
సౌర వెలుగులు ఉత్పత్తి
(మెగావాట్లలో)కి అవకాశమున్న ప్రధాన భవనాలు..
ఉస్మానియా వర్శిటీ 5,100
బేగంపేట్, శంషాబాద్ విమానాశ్రయాలు 700
రైల్వే స్టేషన్లు 3,187
బస్ డిపోలు 3,000
మెట్రో స్టేషన్లు 679
Comments
Please login to add a commentAdd a comment