మహదేవపూర్ : జిల్లాకు మరో ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టు దక్కింది. కొద్ది రోజులుగా తర్జనభర్జన పడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్టకేలకు ఖరారైంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా గోదావరినదిపై మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం జరిగిన హరితహారం సభలో ప్రకటించడంతో జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును గతంలో ప్రతిపాదించిన ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టి వద్ద కాకుండా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ పేరున నిర్మించనున్నారు. గతంలో ప్రతిపాదించిన తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటున్న కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.
దీనికి ప్రత్యామ్నాయంగా అనువైన స్థలం ఎంపిక చేసే బాధ్యతను తెలంగాణ నీటిపారుదల శాఖ రిటైడ్ ఇంజనీర్ల బృందానికి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు పది మంది ఇంజనీర్ల బృదం మార్చి నెలలో ఖమ్మం జిల్లా దుమ్మగూడెం నుంచి మొదలుకుని ఎల్లంపల్లి వరకు గోదావరినదిపై సర్వే నిర్వహించి మేడిగడ్డను అనువైన ప్రాంతంగా గుర్తించారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత, ఎంత ఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చనే విషయాలను సర్వే చేసేందుకు ప్రభుత్వం వాస్కోప్ అనే సంస్థకు అప్పగించింది. సదరు సంస్థ పలుమార్లు మేడిగడ్డ వద్ద సర్వే చేసి ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ప్రభుత్వం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
మేడిగడ్డ వద్ద 110 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవచ్చని వాస్కోప్ సంస్థ మొదటగా సూచించినప్పటికీ దాని వల్ల దాదాపు 5 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో డిజైన్‌ను మార్చాలని సీఎం సూచించారు. ఈ మేరకు ఏవిధమైన ముంపు లేకుండా ఉండేలా 99 మీటర్లకు మార్చి డిజైనింగ్ చేయడంతో ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలం తుమ్మడిహట్టికి దాదాపు 100 కిలోమీటర్ల దిగువన, కాళేశ్వరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరాన ఉంది.
మేడిగడ్డ వద్ద సంవత్సరంలో రెండు వందల రోజులు నీటి లభ్యత ఉంటుందని, ఇక్కడినుంచి 160 టీఎంసీల నీటిని పంపింగ్ చేసుకునే అవకాశం ఉందని సర్వే సంస్థ స్పష్టం చేసింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టులకు నీటిని పంపింగ్ చేస్తారు. కొంత ఓపెన్ కాల్వల ద్వారా, మరికొంత సొరంగ మార్గం ద్వారా పంపింగ్ చేయూల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాలకు తాగునీటిని అందించే అవకాశం ఉంటుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్
Published Sun, Jul 5 2015 1:47 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement