
స్థలాన్ని పరిశీలిస్తున్న టీఎస్‌ఐఐసీ బృందం
రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం సిగలో మరో పరిశ్రమ రాబోతోంది. శనివారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ వనజాదేవి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా వనరుల లభ్యత (బొగ్గు, నీరు, విద్యుత్, రోడ్డు, రైలు రవాణా)ఉండడంతో ఉత్పాదక శక్తి మెరుగ్గా ఉంటుందని నిర్ణయించారు. ఫలితంగా అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్‌కు టీఎస్‌ఐఐసీ అధికా రుల బృందం అప్పటికప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇండస్ట్రియల్ పార్క్‌కు కేటాయించిన స్థల వివరాలను తెలియజేస్తూ....
అంతర్గాంలోని ఖాయిలాపడిన స్పిన్నింగ్, వీవింగ్ టెక్స్‌టైల్ విభాగానికి చెందిన 548.26 ఎకరాల విస్తీర్ణంలోని వంద ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్‌కు కేటాయించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేయగా జేసీ వనజాదేవి ప్రత్యేక చొరవ తీసుకొని అంతర్గాంలోని టెక్స్‌టైల్ భూములు అనువైందిగా గుర్తించి సర్వే చేయించారు. వివిధ సర్వే నెంబర్లలో 102.20 ఎకరాల విస్తీర్ణం ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనకు అనువుగా ఉంటుం దని గుర్తించారు. పార్క్‌కు కేటాయించిన స్థలంలో 57.23 ఎకరాలు గోలివాడ శివారు, మిగతా 44.37 ఎకరాలు రాయదండి శివారు స్థలంగా గుర్తించారు. ఇందులో ఏలాంటి నిర్మాణాలు లేకపోగా భూమి చదునుగా మైదాన ప్రాంతంగా ఉండడంతో ఇండస్ట్రియల్‌పార్క్‌కు అనువుగా ఉంటుందని జేసీ వనజాదేవి టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డికి వివరించారు.
త్వరలోనే స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్ (సీసీఎల్‌ఏ)కు బదిలీ చేసి టీఎస్‌ఐఐసీకి భూ బదలాయింపు చేయనున్నామన్నారు.ఇప్పటికే ఇండస్ట్రియల్‌పార్క్‌లో పది కంపెనీలతో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు చేపట్టనున్నారని, ఇందులో ఇప్పటికే ఐదుగురు పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరిపామని మరో ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. ఇందులో ప్రధానంగా అర్హులైన బర్మా, కాందీశీకుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
నిరుద్యోగ సమస్య నిర్మూలనే ధ్యేయంగా
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగ యువకులు వేలాది ఉండడంతో అంతర్గాంలోని ప్రభుత్వ స్థలాల్లో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సీఎం కేసీఆర్ సైతం భూమి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని పేర్కొనడంతో తాను ఆ దిశగా అడుగులు వేశానన్నారు. అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో కనీసం ఆరు వేల మందికి ప్రత్యక్షంగా, పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమ స్థాపనకు స్థానిక ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రతీ నియోజకవర్గానికిఒక పరిశ్రమ ఏర్పాటు..
ఉమ్మడి ప్రభుత్వ హయంలో రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల మాత్రమే పరిశ్రమలను స్థాపించడంతో ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుండేదని టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించడంతో నియోజకవర్గానికి ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది ఆయన ధ్యేయమన్నారు. ఆ దిశగా తాము చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో పరిశ్రమ స్థాపనకు అంతర్గాం టెక్స్‌టైల్ భూములు అనువుగా ఉండడంతో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు బీజం పడనుంది. దశల వారీగా భూ లభ్యతను బట్టి పరిశ్రమలను విస్తరించే అవకాశం ఉంటుందన్నారు.
మ్యాప్ సిద్ధం చేసి అప్పగించండి
అంతర్గాం టెక్స్‌టైల్ భూములు పరిశ్రమల స్థాపనకు చాలా అనువుగా ఉందని టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి అన్నారు. సదరు భూమి నుంచి రైల్వేస్టేషన్, రాజీవ్ రహదారి, నేషనల్ హైవే, ఏయిర్‌పోర్టు, నీటి లభ్యత, బొగ్గు లభ్యత తదితర వివరాలతో కూడిన నూతన మ్యాప్‌ను సిద్ధం చేసి తమకు అప్పగించాలని కోరారు. అదే విధంగా ఇక్కడ వంద ఎకరాలు పోను మరో మూడు వందల ఎకరాలు తమకు అప్పగిస్తే మరో పెద్ద పరిశ్రమ స్థాపించేందుకు చర్యలు చేపడతామని ఎండీ నర్సింహారెడ్డి జేసీ వనజాదేవిని కోరగా సానుకూలంగా స్పందించారు. తమకు జేసీ భూనివేదికలు అందజేసిన మరుక్షణం నుంచే పరిశ్రమ స్థాపనకు చర్యలు చేపట్టనున్నామని ఎండీ పేర్కొన్నారు. స్థల పరిశీలనలో టీఎస్‌ఐఐసీ డీజీఎం విఠల్, కరీంనగర్ జోనల్ మేనేజర్ అజ్మీర, అంతర్గాం తహశీల్దార్ వంగల మోహన్‌రెడ్డి, టీటీఎస్ అంతర్గాం సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, అంతర్గాం, పాలకుర్తి జెడ్పీటీసీలు ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, ఎంపీపీ దుర్గం విజయ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు బాదరవేణి స్వామి, ధర్ని రాజేష్‌లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రూ.600కోట్లు
గోదావరిఖని(రామగుండం): ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 600కోట్లు వెచ్చిస్తోందని టీఎస్‌ఐఐసీ చైర్మెన్ బాలరాయమల్లు, ఎండీ వెంకటనర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్‌తో కలిసి మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 42 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 3,500ఎకరాల భూమిని గుర్తించగా, తెలంగాణా ఏర్పడిన తర్వాత ఇండస్ట్రియల్ పార్కుల కోసం 1.43లక్షల ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఇండస్ట్రియల్ పార్కులు
కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు తర్వాత అగ్రి పొడక్ట్ ఏర్పాటు చేసే పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. దీనికోసం 15చోట్ల భూమిని గుర్తించామన్నారు. ఫుడ్, అగ్రికల్చర్, ఇన్‌ఫాస్ట్రక్చర్ కోసం 14ట్రస్టీ ఏరియాలు గుర్తించే పనిలో ఉన్నామన్నారు. టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, ఏరోస్పేస్, పార్మా పార్కుల ఏర్పాటు కోసం మ్యాపింగ్ తయారు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment