ప్రకృతిని ప్రేమిస్తేనే పచ్చని తెలంగాణ | green telangana comes when we love nature | Sakshi
Sakshi News home page

ప్రకృతిని ప్రేమిస్తేనే పచ్చని తెలంగాణ

Published Sun, Oct 19 2014 2:17 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ప్రకృతిని ప్రేమిస్తేనే పచ్చని తెలంగాణ - Sakshi

ప్రకృతిని ప్రేమిస్తేనే పచ్చని తెలంగాణ

ప్రజాగాయకుడు జయరాజ్

‘ప్రకృతికి అందరూ సమానమే. పేద, ధనిక.. ఉన్నత వర్గం, అట్టడుగు వర్గం అనే తారతమ్యాలు ఉండవు’ అంటున్నారు ప్రజా గాయకుడు జయరాజ్. ‘ప్రకృతి కూడా కమ్యూనిస్టే. దానిని మానవులే కలుషితం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగం లో నిష్ణాతులవుతుంటారని, వీరు నేర్చుకున్నదంతా ప్రకృతిని చూసేనని అన్నారు. శనివారం ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

జయరాజ్ మనోభావాలు ఆయన మాటల్లోనే...
 
మానువుడి అభివృద్ధి వెనుక ప్రకృతి పాత్ర కీలకం. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరు గజాల చీరెను నేచి ప్రపంచాన్ని అబ్బురపర్చిన నేతన్నకు సాలీడు ఆది గురువు. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని న్యూటన్ కనుగొన్నది చెట్టు పైనుంచి యాపిల్ కిందకు పడ్డప్పుడే. మధుర గీతాలతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే గాయకులు కోకిల రాగాల నుంచే నేర్చుకున్నారు.  ఇలా మానవుడు నేర్చుకున్నవన్నీ ప్రకృతిని చూసే. అందుకే.. ప్రకృతిలో చెట్టూ చేమ, రాయీ రప్పా, వాగులు, వంకలు, పిల్లగాలి, సెలయేరు కవులకు కవితా వస్తువులయ్యాయి.

చెట్లను నరకొద్దు
ప్రకృతికి దగ్గరగా ఎవరుంటారో వారే సుఖంగా జీవిస్తారు. వారికి ఏ కష్టమూ ఉండదు. చెట్లను నరకడం, వాతావరణాన్ని కలుషితం చేయడం మూలంగా మనిషి అనేక కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడు. సకాలంలో వర్షాలు పడటం లేదు. పంటలు పండటంలేదు. కరెంట్ కొరత తీవ్రంగా ఉంది. వీటన్నింటికీ కారణం మానవుడు ప్రకృతిని నాశనం చేయడమే. చెట్లను విరివిగా పెంచినప్పుడే పచ్చని తెలంగాణ సాధ్యం. నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువులు పూడుకుపోయాయి. వాటిని పునరుద్ధరిస్తే ప్రకృతిని కాపాడినట్టవుతుంది.  సాగునీరు, తాగునీరుకు ఇబ్బంది ఉండదు. చెరువులు నిండుగా ఉన్నచోటికే పశువులు, పక్షులు, చేపలు, సకల జంతువులు వస్తాయి.
 
ఏడు మండలాలు ఏపీలో కలపడం వెనక కుట్ర
ఖమ్మం జిల్లా రాజకీయ, సాంస్కృతిక, సాహితి రంగాలకు పెట్టింది పేరు. నదీ జలాలు, అపారమైన ఖనిజ సంపదకు ఇక్కడ కొదువలేదు. గిరిజనుల సంస్కృతి కనుమరుగైన ఖమ్మం జిల్లాను ఊహించాలంటే ఎవరికైనా దుఃఖం వస్తుంది. ఆరు దశాబ్దాల పోరాటాల అనంతరం  తెలంగాణను సాధించుకున్నాం. అయినా మనకు పూర్తిస్థాయిలో ఊరట కలగలేదు. జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపారు. దీని వెనక పెద్ద కుట్రే దాగుంది.   
 
సమాజ హితం కోసమే నా పాట
సమాజ హితం కోసమే తన పాట అని జయరాజ్ అన్నారు. మనిషి ముందుగా తనను తాను ప్రేమించుకోవాలని, సమాజానికి ఏ విధంగా ఉపయోగ పడాలో ఆలోచించుకోవాలని అన్నారు. ఆకలి, అవమానాలు, కష్టాలు, కడు దారిద్య్రం అనుభవించి.. సమాజంలో నేలకు కొట్టబడిన వారు అదే వేగంతో లేవాలని అన్నారు. అప్పుడే ప్రాయోజకులవుతారని,  సమాజాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తారని అభిప్రాయపడ్డారు. ఇందుకు బీఆర్ అంబేద్కర్ విధానమే ఆదర్శమన్నారు.

‘జాగోరే జాగో
అంబేద్కర్... జగతికి మార్గం అంబేద్కర్... మా చల్లని టీచర్ అంబేద్కర్... మా దారికి టార్చి అంబేద్కర్.. భారత్‌కు మార్క్స్ అంబేద్కర్..’ అని తన గాన మాధుర్యంతో కొనియాడారు. తల్లిదండ్రులను ప్రేమించిన వారే ఉత్తములన్నారు. ‘అమ్మా నీ పిలుపులోనే అమృతం ఉన్నది.. అమ్మా నీ పిలుపులోనే అనురాగం ఉన్నది’ అంటూ మాతృమూర్తి మమతలనురాగాలపై రాగం ఆలపించారు. ‘నాయనా నీ మట్టికాళ్లకు దండమే... నీ మంచి మనసుకు దండమే..’ అంటూ తండ్రిపై ఉన్న వాత్సల్యాన్ని తన పాటతో చాటిచెప్పారు. ‘కొమ్మల్లో కోకిల పాటలు పాడాలి.. పల్లెల్లో అక్షర దీపం  వెలగాలి’ అంటూ అక్షరాస్యత ఆవశ్యకతను ఎత్తిచూపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement