గ్రూప్-2లోనూ రాత పరీక్షలు! | Group 2 Mains to be conducted in descriptive | Sakshi
Sakshi News home page

గ్రూప్-2లోనూ రాత పరీక్షలు!

Published Sun, Jan 18 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

గ్రూప్-2లోనూ రాత పరీక్షలు!

గ్రూప్-2లోనూ రాత పరీక్షలు!

* ‘సిలబస్ కమిటీ’ సమావేశంలో ప్రతిపాదన  
* ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాలని యోచన
* ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్-2లోనే కొనసాగింపు
* గ్రూప్-1 ఎస్సే పేపర్‌లో తెలంగాణ అంశాలపై ప్రశ్నలు
* 29న తుది నిర్ణయం.. 30న టీఎస్ పీఎస్సీకి నివేదిక

 
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షల తరహాలో గ్రూప్-2 పోస్టులకు కూడా రాత పరీక్షలు (డిస్క్రిప్టివ్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు గ్రూప్-2 కోసం ఇంటర్వ్యూలు నిర్వహించే విధానాన్నీ అమలుచేయాలని భావిస్తోంది. అలాగే ఈ పోటీ పరీక్షల్లో ఎస్సే పేపర్లలో తెలంగాణకు సంబంధించిన అంశాలను సిలబస్‌లో చేర్చాలని నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పుల కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షల విధానం (స్కీమ్), సిలబస్‌లో మార్పులపై విస్తృతంగా చర్చించారు.
 
మార్పులు తప్పనిసరి..
 తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే గ్రూప్-2 అధికారులు భవిష్యత్‌లో గ్రూప్-1 స్థాయికి వెళతారని, అందువల్ల గ్రూప్-2 పరీక్షా విధానంలో మార్పులు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేవలం ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్) విధానంలో ప్రశ్నలు ఇచ్చి ఎంపిక చేయడం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్రూప్-2లోనూ రాతపూర్వక పరీక్షల (డిస్క్రిప్టివ్) విధానం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని... ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికయ్యే వారికి కచ్చితంగా ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనని సమావేశంలో స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
 
 ఆ సిఫారసులు వద్దు..
 ఏపీపీఎస్సీలో సంస్కరణలపై ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీసీఎల్‌ఏ జె.సత్యనారాయణ ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పట్లో ప్రభుత్వం గ్రూప్-2లో ఇంటర్వ్యూలను తొలగించింది. అందులోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా కేవలం ఆబ్జెక్టివ్ విధానంలోనే ఎంపిక చేయాలన్న సూచనను కూడా అప్పట్లో ప్రభుత్వం ఆమోదించింది. అంతేగాకుండా గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బిగా మార్చాలని కూడా సిఫార్సు చేసింది. అయితే ఈ విధానాలు సరికావని తాజాగా టీఎస్ పీఎస్సీ సిలబస్ కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బిగా కాకుండా గ్రూప్-2లోనే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే గ్రూప్-1లోని జనరల్ ఎస్సే (వ్యాసం) పేపర్‌లో తెలంగాణ సామాజిక రాజకీయాలు, భౌగోళిక చరిత్ర, ఆర్థిక అంశాలు, ఉద్యమ చరిత్రను సిలబస్‌గా ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 
 ఇక గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షల్లోనూ తెలంగాణ ఉద్యమ చరిత్రపై ప్రశ్నలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ఈ నెల 29న జరిగే స్కీమ్, సిలబస్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 30వ తేదీన ఈ నివేదికను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కమిటీ అందజేయనుంది. సర్వీస్ కమిషన్ ఈ అంశాలన్నింటిపై మరోమారు చర్చించి... పరీక్షల విధానాలు, సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతుంది. వాటిని ప్రభుత్వం పరిశీలించి.. ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం మార్పులు అమల్లోకి వస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement