గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే.. | Groups notifications after march, says Ghanta chakrapani | Sakshi
Sakshi News home page

గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే..

Published Sat, Dec 27 2014 1:26 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే.. - Sakshi

గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే..

 ‘సాక్షి’తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
 
 సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానం రూపొందించిన తరువాతే గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. పరీక్షా విధానం రూపకల్పన, సిలబస్‌ను నిర్ణయించేందుకు నిపుణుల కమిటీలతో ప్రత్యేకంగా అధ్యయనం చేయిస్తామని చెప్పారు. కమిషన్‌లో త్వరలో చేపట్టనున్న మార్పులపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
 
 గ్రూప్-1, 2 పరీక్షల నిర్వహణపై రెండు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఒక కమిటీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేస్తుంది. మరో కమిటీ పరీక్షల విధానం, షెడ్యూల్‌పై అధ్యయనం చేసి కమిషన్‌కు నివేదిక ఇస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సిలబస్‌ను ప్రకటిస్తాం. మార్చి తరువాతే గ్రూప్-1, 2 నోటిఫికేషన్లను విడుదల చేస్తాం. జనవరిలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని సర్వీస్ కమిషన్ చేపట్టే అంశంపై విద్యాశాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నాం.
 
 యూపీఎస్సీ తరహా పరీక్షా విధానం
 
 దేశంలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును పరిశీలించిన తరువాతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏటా పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. అందులో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫలితాల ప్రకటన తేదీలను పరీక్షకు ముందుగానే తెలియజేస్తాం. అభ్యర్థుల వ్యక్తిత్వం తెలుసుకునేందుకు సివిల్స్ తరహాలో అదనంగా మరో పేపర్‌ను గ్రూప్-1 పరీక్షలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. గ్రూప్1, గ్రూప్-2 (ఎగ్జిక్యూటివ్) పరీక్షలకు ఇంటర్వ్యూలుంటాయి. నిష్పాక్షికంగా, పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే ఇంటర్వ్యూకు మార్కులుంటాయి.
 
 కేరళ తరహాలో...
 
 కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా... డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, డిప్లమో వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హతల వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగుల డేటా బేస్ మా వద్ద సిద్ధంగా ఉంటుంది. ప్రతి పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే విధానం ప్రవేశపెడతాం. ఇక ఆయా శాఖలో ఏటా ఎన్ని పదవీ విరమణలు (రిటైర్మ్‌ంట్స్) ఉంటాయో ముందే జాబితా సిద్ధం చేసుకొని వారు రిటైరయ్యే సమయానికి కొత్త అభ్యర్థులు ఆ పోస్టుల్లో చేరే విధంగా పరీక్షలు ముందుగానే నిర్వహించి అభ్యర్థుల మెరిట్ లిస్టు సిద్ధంగా ఉంచుతాం. ఆ శాఖ కోరగానే ఈ జాబితాను వారికి అందజేస్తాం. దీంతో తక్షణం ఖాళీల భర్తీ చేయడానికి వీలవుతుంది. మెరుగైన పాలన, సుపరిపాలన అందించే అవకాశం ఉంటుంది.
 
 జనవరిలో ఖాళీలపై స్పష్టత
 
 రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించేందుకు అన్ని విభాగాల అధిపతులతో చీఫ్‌సెక్రటరీ సమక్షంలో జనవరిలో కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. అప్పుడే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి. ఏ క్యాడర్‌లో ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఇక ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఖాళీలను గుర్తించి, వాటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తరవాత కమిషన్‌కు అందజేస్తేనే మేం పరీక్షలు నిర్వహిస్తాం. లక్ష ఉద్యోగాలా అంతకంటే ఎక్కువా తక్కువా అన్న అంశం ప్రభుత్వం పరిశీలిస్తుంది.
 
 పకడ్బందీగా పరీక్షలు
 
 అనువాదం, అన్వయ దోషాలు లేకుండా చూసేందుకు కమిషన్‌లో అకడమిక్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఇందులో ఆయా సబ్జెక్టుల ప్రొఫెసర్లుంటారు. పరీక్షలకు సంబంధించి ప్రశ్నల నిధిని కూడా రూపొందించాలని యోచిస్తున్నాం. ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా గుర్తించే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. ప్రతి పరీక్షకు 4 సెట్ల ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్ష జరిగే రోజున ఒక సెట్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తాం.
 
 కొత్త రాష్ట్రం.. కొత్త సిలబస్..
 
 గ్రూప్స్ పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉండటం తప్పనిసరి. తెలంగాణ చరిత్ర, ఆర్థిక వనరులు, నైసర్గిక స్వరూపం, పరిశ్రమలు, సాహిత్యం, ఆర్థిక వ్యవస్థ స్వరూపం, కవులు, తెలంగాణ ఉద్యమం తదితర అన్ని అంశాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలుంటాయి. నిపుణుల కమిటీ నివేదిక వస్తేనే  సిలబస్‌పై స్పష్టత వస్తుంది.
 
 తగినంత సిబ్బంది లేకనే ఆలస్యం
 
 సర్వీస్ కమిషన్ నూతనంగా ఏర్పాటైనా పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వనరులు లేకపోవడం వల్లే పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాం. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు పూర్తిస్థాయి సిబ్బంది, కార్యాలయం, బడ్జెట్ కేటాయిస్తుందని భావిస్తున్నాం. ఆ తరవాతే కమిషన్ పనులు వేగవంతమవుతాయి.
 
 స్థానికత నిర్థారించేది ప్రభుత్వమే
 
 అభ్యర్థుల స్థానికతను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో కమిషన్ ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వం 1956నే ప్రామాణికంగా తీసుకుంటే దాన్నే కమిషన్ అమలుచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement