హైకోర్టులో ఈ–ఫైలింగ్‌కు  మార్గదర్శకాలివీ..  | Guidelines For E Filing In Telangana High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ఈ–ఫైలింగ్‌కు  మార్గదర్శకాలివీ.. 

Published Sun, Mar 29 2020 3:40 AM | Last Updated on Sun, Mar 29 2020 3:40 AM

Guidelines For E Filing In Telangana High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ తీవ్రరూపంలో ఉన్న నేపథ్యంలో హైకోర్టు అతి ముఖ్యమైన కేసుల నమోదుకు, విచారణ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ–ఫైలింగ్‌ విధానాలను తెలియజేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా... 
►అత్యవసర కేసులను దాఖలు చేసే న్యాయవాదులు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఈ–మెయిల్‌ ద్వారా పంపాలి. కేసుకు సంబంధించిన అన్ని పత్రాల పైన న్యాయవాది, పిటిషనర్లు సంతకాలు చేయాలి. 
►అలా చేసిన పిటిషన్‌ను పీడీఎఫ్‌ రూపంలో ఈ మెయిల్‌ చేయాలి. అదే ఈమెయిల్‌లో కేసు దాఖలు చేసిన న్యాయవాది, పిటిషనర్‌ పేర్లు, న్యాయవాది కోడ్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ, సెల్‌ ఫోన్‌ నంబర్లను కూడా పంపాలి.  
►ఇలా దాఖలయ్యే పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి స్వయంగా పరిశీలించి విచారణయోగ్యమైన వాటిని ఎంపిక చేస్తారు. విచారణ చేయాలని నిర్ణయించిన కేసుల గురించి, విచారణ జరిపే తేదీ తదితర సమాచారాన్ని న్యాయవాది మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్‌ ద్వారా సమాచారం అందుతుంది. 
►విచారణ చేయాలని నిర్ణయించిన కేసుల్లో న్యాయవాది లేదా పిటిషనర్‌ వారిళ్ల వద్ద నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించాలి. ఈ విధంగా చేసేందుకు వీలుకాకపోతే బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం పక్కన మూడో క్వార్టర్‌లోని కంట్రోల్‌ రూం నుంచి వాదనలు వినిపించవచ్చు.  
►వీడియో కాన్ఫరెన్స్‌ కోసం న్యాయవాది లేదా పిటిషనర్‌ ‘జూమ్‌ క్లౌడ్‌ మీటింగ్స్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. న్యాయవాది లేదా పిటిషనర్‌ ఫోన్‌కు లింక్‌ అందాక కోర్టు హాలుతో అనుసంధానం అయ్యాక వాదనలు వినిపించాలి.  
►ఇరుపక్షాల వాదనల తర్వాత కోర్టు రూంలోని కోర్టు మాస్టర్‌కు న్యాయమూర్తులు ఉత్తర్వులు చెబుతారు. ఆ ఉత్తర్వుల ప్రతిపై న్యాయమూర్తితోపాటు హైకోర్టు జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌ సంతకాలు చేశాక హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.  
►దీనినే హైకోర్టు ఉత్తర్వులుగా పరిగణించాలి. సాంకేతిక సమస్యలు వస్తే హైకోర్టు రిజిస్ట్రార్‌ (ఐటీ)కు ఫోన్‌ లేదా ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. 
►కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన ఈ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాక పిటిషనర్లు, ప్రతివాదులు తమ వాదప్రతివాదనల ప్రతులను హైకోర్టుకు ఇప్పుడున్న విధానంలో అందజేయాలి. 
►కేసులు పరిష్కారం అయినా, అవ్వకపోయినా వాటికి చెందిన పత్రాలను హైకోర్టులోని ఫైలింగ్‌ విభాగంలో దాఖలు చేయాలి.  
►ఈ–ఫైలింగ్‌కు హైకోర్టు కేటాయించిన మెయిల్‌ ఐడీ  ట్ఛజ.జ్ఛn్టటజిఛిః్చజ్జీ.జౌఠి.జీnకు వివరాలు పంపాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement