సాక్షి ప్రతినిధి, నల్లగొండ
పన్నెండేళ్లకోసారి పుష్కరాలు... ఎప్పుడు వస్తాయో.. ఏ ముహూర్తంలో వస్తాయో కూడా తెలియదు.. అలాంటి పుష్కరాలు పుట్టినరోజు కలిసివచ్చేలా వస్తే... ఆ రోజు అధికారికంగా మంత్రి హోదాలో పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే అవకాశం వస్తే... అంతకు మించిన సేవ ఏముంటుంది? పుష్కర స్నానం చేయడం ఎంత పుణ్యమో.. అంతకుమించి పుష్కరాలకు వచ్చే భక్తులకు అధికారికంగా సేవ చేయడం అంతే పుణ్యం కదా.. అలాంటి అవకాశమే వచ్చింది మన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాలలో అద్భుత సేవ చేసే అవకాశం మంత్రి హోదాలో లభించింది ఆయనకు. తన 51వ పుట్టిన రోజు అయిన శనివారం మంత్రి జగదీశ్‌రెడ్డి భద్రాచలంలోనే గడిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వెళ్లిన ఆయన శనివారం తెల్లవారుజామునుంచే పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణలో బిజీబిజీగా గడిపారు. ముఖ్యంగా భద్రాచలం సమీపంలో ట్రాఫిక్ జామ్ కాకుండా నివారించేందుకు గాను అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగంతో కలిసి ఆయన సమీక్షించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోడుగా ఆయన శనివారం పూర్తిగా పుష్కర సేవలోనే నిమగ్నమయ్యారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లోనే ఆయన దాదాపు 2 గంటలకు పైగా ఉన్నారు. ఘాట్‌లో స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా దేవాదాయ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
సాయంత్రం ఏడు గంటల సమయంలో కూడా ఆయన భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. శనివారం ఒక్కరోజే భద్రాచలానికి దాదాపు 5.5లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానం చేసేందుకు రాగా, ఆదివారం కూడా అదే తరహాలో వస్తారన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం కూడా మంత్రి జగదీశ్ భద్రాచలంలోనే ఉంటారని సమాచారం. ఈ విషయమై మంత్రి జగదీశ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం కోసం భద్రాచలం వచ్చానని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
పుట్టిన రోజు.. ‘పుష్కర సేవ’
Published Sat, Jul 18 2015 11:54 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement