‘ఖని’ కేంద్రంగా గుట్కా దందా! | Gutka danda to khani central! | Sakshi
Sakshi News home page

‘ఖని’ కేంద్రంగా గుట్కా దందా!

Published Wed, Mar 9 2016 1:39 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

‘ఖని’ కేంద్రంగా గుట్కా దందా! - Sakshi

‘ఖని’ కేంద్రంగా గుట్కా దందా!

* నెలకు రూ.3 కోట్లకు పైగా అమ్మకాలు
* ‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు
* సిద్దిపేటలో నిల్వ కేంద్రం
* నేతలే పెట్టుబడిదారులు


కరీంనగర్ క్రైం : జిల్లాలో గోదావరిఖని కేంద్రంగా గుట్కా దందా జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన పోలీసులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్‌లో గుట్కాదందాకు స్థానిక పోలీసులు బ్రేక్ వేసినా.. ‘ఖని’లో మాత్రం అక్కడి పోలీసులు గుట్కా వ్యాపారులకే వంతపాడుతున్నట్లు తెలుస్తోంది.
 
కరీంనగర్ నుంచి ‘ఖని’కి ..
గతంలో జిల్లాకేంద్రంలో గుట్కా దందా జోరుగా కొనసాగేది. వివిధ ప్రాంతాలకు ఇక్కడినుంచే రవాణా చేసేవారు. ఎస్పీ జోయల్‌డేవిస్ గుట్కా రవాణాపై ఉక్కుపాదం మోపడంతో కిందిస్థాయి సిబ్బందిలో చలనం వచ్చింది. జిల్లాకేంద్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్ సీఐలు ఎప్పటికప్పుడు దాడులు చేసి పెద్దఎత్తున గుట్కాలను పట్టుకుని అమ్మకాలు, రవాణాకు బ్రేక్ వేశారు. దీంతో 95 శాతం అమ్మకాలు నిలిచిపోయాయి. ఇక్కడి గుట్కా వ్యాపారులు ఇతర వ్యాపకాలకు మళ్లారు. అదే సమయంలో గోదావరిఖనిలో గుట్కా అమ్మకాలు, వ్యాపా రం జోరుగా సాగుతుండడం చర్చనీయూంశమైంది.
 
నెలకు రూ.కోట్లలో దందా
గోదావరిఖని ప్రాంతంలో ప్రతినెలా గుట్కాల దందా రూ.మూడు నుంచి రూ.నాలుగు కోట్ల వరకు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడినుంచే పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర సరిహద్దు, ధర్మపురి వరకూ దందాను విస్తరించారని తెలిసింది. మహారాష్ట్ర, మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి గుట్కా లోడ్‌తో పదుల సంఖ్యలో లారీలు గోదావరిఖ నికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వ్యాపారులు సిద్దిపేటకు చెందిన కొందరు బడా నేతలతో సత్సంబంధాలు పెట్టుకుని ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలొస్తున్నారుు. కంపెనీల నుంచి తెప్పించి సిద్దిపేటలో నిల్వ చేసి అనంతరం ఖనికి తరలిస్తున్నట్లు సమాచారం.
 
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు
ఈ గుట్కా దందాపై గోదావరిఖని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఫిర్యాదు చేసినా పట్టుకోవాల్సిన పోలీసులే.. వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ‘లక్షల్లో మామూళ్లు ఇస్తున్నాం.. ఫలానా నాయకుడి అనుచరులు ఈ దందాల్లో భాగస్వాములు..’ అంటూ కొందరు గుట్కా వ్యాపారులు బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి వ్యాపారం ఎలా ఎదుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

జిల్లాకేంద్రంలో ఆర్నెల్ల కాలంలో సుమారు రూ.కోటిన్నర విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదే గోదావరిఖనిలో ఒక్కకేసూ నమోదు కాలేదు. ఎల్‌ఎండీ పోలీసులు కూడా రెండు నెలల క్రితం గోదావరిఖనికి రవాణా అవుతున్న రూ.50 లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గుట్కా దందాను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.
 
భారీగా గుట్కాల పట్టివేత
* ఒకరిపై కేసు నమోదు

కరీంనగర్ క్రైం : జిల్లాకేంద్రం శివారులో నిల్వ చేసిన గుట్కాప్యాకెట్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ కరీంనగర్ మండలంలోని రజిచమన్‌కాలనీలో ఓ రెండు గదులను అద్దెకు తీసుకుని వాటిలో భారీగా గుట్కా ప్యాకెట్లు నిల్వచేశాడు. విశ్వసనీయ సమాచారంతో కరీంనగర్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో దాడి చేశారు. షట్టర్లు ఓపెన్ చేసి చూడగా.. గుట్కాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.రెండున్నర లక్షలకుపైగా ఉంటుందని గుర్తించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement