కమిషనరేట్ కోసం కసరత్తు షురూ
కమిషనరేట్ కోసం కసరత్తు షురూ
Published Fri, Oct 7 2016 1:06 PM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
గోదావరిఖనిలో భవనాలను పరిశీలించిన ఎస్పీ జోయల్‌డేవిస్
గోదావరిఖని : రామగుండంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు కసరత్తు మొ దలైంది. కమిషనరేట్ కార్యాలయం కోసం భవనాలను ఎస్పీ జోయల్ డేవిస్ గురువారం పరిశీలించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఐజీ లేక డీఐజీ స్థాయి అధికారి పాలన ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్పీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోకి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను రెండు జోన్లుగా ఏర్పాటు చేసి పెద్దపల్లిలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ, రామగుండంలో ఒక ఏసీపీ, మంచిర్యాలలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ విధులు నిర్వహిస్తారని వివరించారు. ఈ నెల 11లోగా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని, ఆ లోపే కార్యాలయాలను సిద్ధం చేయనున్నా మని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో అదనంగా ఉండే స్పెషల్ బ్రాంచ్, సిటీ క్రైమ్ బ్యూరో రికార్డు, ఐటీ టీమ్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్ల ఏర్పాటుకు భవనాలను చూస్తున్నామని చెప్పారు. ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్, టూటౌన్ సీఐ దేవారెడ్డి, రామగుండం సీఐ వాసుదేవరావు భవనాల పనులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను చేసేందుకు ఇద్దరు డీసీపీలు, పరిపాలన వ్యవహారాలు చూసేందుకు ఒక డీసీపీ, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రామగుండంలో లేదా, మంచిర్యాలలో ఏసీపీలు ఉంటారని చెప్పారు. క్రైమ్ కోసం ఏసీపీ, ప్రత్యేకమైన లీగల్ సెల్, సైబర్ క్రైమ్, టాస్క్‌పోర్స్, కమ్యూనికేషన్స్‌కు కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాల్లో అన్ని మండలాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతనే పోలీస్‌స్టేషన్ల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తామని ఎస్పీ తెలిపారు.
Advertisement