నాటిమాటే నిజమైంది..
♦ పదేళ్ల కిందటే సిద్దిపేటను బంగారు తునక చేస్తానన్న కేసీఆర్
♦ సాగు, రైల్వే, జిల్లా కేంద్రం సాధనే ప్రధాన లక్ష్యం
♦ హరితహారానికి నెల వేతనం విరాళం
♦ రాష్ట్రనీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్ : నాటి కేసీఆర్ మాట నేడు నిజం కాబోతున్నదని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పదేళ్ల కిందట సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. సిద్దిపేటను బంగారు తునకగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ మాట నేడు వాస్తవ రూపం దాలుస్తోందన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేటకు సాగునీరు, రైల్వేలైన్‌తో పాటు జిల్లా కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని కేసీఆర్ తనకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి ఆశీర్వదించారన్నారు.
భవిష్యత్తులో సిద్దిపేట బంగారు తునకగా మారనుందని ఆనాడే చెప్పారని, నేడు ఆదిశగా కృషి జరుగుతోందన్నారు. సిద్దిపేట ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. హరితహారం సిద్దిపేట వాసులకు కొత్తకాదన్నారు. 1966-67లో ఎమ్మెల్యేగా కేసీఆర్ హరితహారానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నేడు నాటనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఇంటింటికి తాగునీటిని మానేరు డ్యామ్ నుంచి తెప్పించిన కేసీఆర్ నేడు వాటర్‌గ్రిడ్‌తో తెలంగాణ వ్యాప్తంగా తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
కలెక్టర్ నేతృత్వంలో హరితహారం వేగవంతంగా కొనసాగుతోందన్నారు. అధికారులు వేతనాన్ని విరాళంగా అందించి ఆదర్శంగా నిలిచారన్నారు. మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని హరితహారానికి అందించనున్నట్లు సభాముఖంగా పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాలో 3.50 కోట్ల మొక్కలను పెంచనున్నట్లు అందుకు 1.25 కోట్ల ట్రీగార్డులను సేకరించినట్లు తెలిపారు.
సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి జోగు రామన్న, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, స్థానిక నాయకులు రాజనర్సు, చిన్న, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, పాల సాయిరాం, కనకరాజు, నగేష్, చిప్ప ప్రభాకర్, కూర బాల్‌రెడ్డి, మల్లికార్జున్, శేషు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.