సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించారు. లేకపోతే ఆర్థిక భారం పెరుగుతోందని, అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న ప్రాజెక్టులపై గడ్కరీ మంగళవారం ఢిల్లీలో సమీక్షించారు. సమీక్షలో తెలంగాణలో ఏఐబీపీ కింద ఉన్న 11 ప్రాజెక్టుల తాజా స్థితిని హరీశ్‌రావు వివరించారు. ఈ ఏడాది ఆయా ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వాల్సిన రూ.651 కోట్ల సాయం విడుదల చేయాలని కోరారు. నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేలా ప్రాధాన్యమివ్వాలని, ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వాలంటే నిధుల విడుదల ప్రాధాన్యాంశమని పేర్కొన్నారు.
పలు ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు కేంద్రం తరఫున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి ముందు కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్దన్‌ను కలసి పాలమూరు, కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరులో వేగం పెంచాలని కోరారు. గడ్కరీతో సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ‘ఏఐబీపీ పథకం కింద కేంద్రం తెలంగాణలో 11 ప్రాజెక్టులకు సాయం చేస్తోంది. వీటికి రావాల్సిన పెండింగ్ నిధులను ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో గడ్కరీ సీడబ్ల్యూసీ అధికారులకు తగిన సూచనలు చేశారు. పెండింగ్ అనుమతులను క్లియర్ చేయాలని సూచించారు’ అని వివరించారు.
రెండు రాష్ట్రాలతో సమావేశం..
కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను పిలిపించి పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు హరీశ్‌రావు తెలిపారు. జలవనరుల శాఖ కార్యదర్శి కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. వివిధ ప్రాజెక్టుల క్లియరెన్స్ వేగవంతం చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ క్లియరెన్స్‌లకు సంబంధించి కేంద్రం ఓ కమిటీని వేసినట్లు వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రం దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు హరీశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తామని గడ్కరీ చెప్పినట్లు తెలిపారు. రాజకీయ కారణాలతో ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఆత్మహత్యలు తగ్గించడానికి ప్రాజెక్టు క్లియరెన్సులు త్వరితగతిన ఇవ్వాలని కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు.
ఉప రాష్ట్రపతితో భేటీ..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మంత్రి హరీశ్‌రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి వెంకయ్యను అయన అధికారిక నివాసంలో కలిశారు. వెంకయ్యకు ఇటీవల యాంజియోప్లాస్టీ జరగడంతో ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment