మండలంలోని బెల్సరీరాంపూర్‌లో మొక్కలు నాటాలని బొట్టుపెటి చెబుతున్న సభ్యురాలు
భీంపూర్(బోథ్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగో విడతలో మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తోంది. ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. హరితహారం విజయవంతం కావాలనే సదుద్దేశంతో ప్రతీ మహిళా సభ్యురాలు ఆరు మొక్కలు నాటించాలని సంబంధిత మండల సీసీలు, ఏపీఎంలు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ మండలంలో సంబంధిత అధికారులు మండల సమాఖ్య మహిళలకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థాయితోపాటు మండలాల్లో అవగాహన కల్పించగా.. గ్రామాల్లోని ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక సంఘాలు) మహిళలకు అందిస్తున్న మొక్కల వివరాలపై ప్రతీరోజు ఉన్నతాధికారులకు రోజువారీగా నివేదికలను కూడా పంపిస్తున్నారు.
96,244 మంది..
జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 532 వీఓల పరిధిలో 9,348 మహిళా సంఘాలుండగా.. అందులో 96,244 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఆరు మొక్కల చొప్పున నాటేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వీరందరూ హరితహారంలో భాగస్వాములు కానున్నారు. ఇందులో తాంసి మండలంలో అతి తక్కువగా 3,447మంది సభ్యులుండగా.. అత్యధికంగా జైనథ్ మండలంలో 8,792మంది ఉన్నారు. జిల్లా మొత్తంగా 96,244 మంది సభ్యులు ఒక్కొక్కరూ ఆరు మొక్కలు నాటేందుకు అన్ని రకాల సరంజామాను ఏర్పాటు చేస్తున్నారు.
అవగాహన.. కొనసాగుతున్న సర్వే..
మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ ఎలా చేపట్టాలనే విషయమై మండల స్థాయి సమావేశాల్లో ఏసీలు, ఏపీయంలు, సీసీలు వివరించారు. అన్ని మండలాల్లో హరితహారంపై సంఘాల మహిళలకు ఇప్పటికే అవగాహన కల్పించారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు తవ్వించి సంఘాల సభ్యులకు మొక్కలు అందించాలని సూచనలు ఉన్నట్లు ఆయా మండలాల ఏపీఎంలు తెలిపారు. ఇంటి పెరట్లో, పాఠశాలలు, కార్యాలయాలు, గ్రామపంచాయతీ పరిసరాలు, మొక్కలకు సంరక్షణ ఉన్న చోట్ల మొక్కలు నాటాలని ఈ అవగాహన కార్యక్రమాల్లో చెప్పారు. ఇప్పటికే ఆయా స్థలాల్లో మొక్కలు నాటి ఉంటే పెరట్లలో, గట్లపై నాటాల్సి ఉంది. వారం రోజులుగా గ్రామాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఏ సంఘం సభ్యులు ఏ మొక్క నాటుతారో ముందుగానే సర్వే ద్వారా తెలియజేస్తున్నారు. ఆ సర్వే వివరాలను ప్రతీరోజు సంబంధిత డీఆర్‌డీఓ కార్యాలయానికి చేరవేస్తున్నట్లు ఆయా మండలాల సీసీలు చెబుతున్నారు.
ఉండమ్మా బొట్టు పెడతా..
గ్రామాల్లో ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ అధికారులు అవగాహన కల్పించగా.. ఆయా మండలాల్లో మండలాల్లో ఉన్న సంప్రదాయ పద్ధతులను అనుసరించి మహిళలకు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో తమ పెరట్లలో, గట్లపై ప్రతీ ఒక్క మహిళా సభ్యురాలు విధిగా ఆరు మొక్కలు నాటాలని చెబుతూ బొట్టుపెట్టే కార్యక్రమం కొనసాగుతోంది.
అందరికీ అవగాహన కల్పించాం..
మండల స్థాయి సమావేశంతోపాటు ఇప్పటికే అన్ని గ్రామాల్లో సభ్యురాలికి బొట్టుపెట్టి మొక్కలు నాటే పద్ధతులు వివరించాం. తదనుగుణంగా గ్రామాల్లో నాటే ఆరు మొక్కల వివరాల సేకరణపై సర్వే కూడా పూర్తవుతోంది. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని అందరికీ తెలియజేస్తున్నాం.
కే.ప్రసాద్‌రాజ్, ఏపీఎం, భీంపూర్
Comments
Please login to add a commentAdd a comment