అత్యవసర సమయాల్లో అతివలకు హాక్ ఐ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు 8,96,554 మంది సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకున్నారు. దీంతో 7,689 ఫిర్యాదులు వస్తే.. 5,212 ఫిర్యాదులను పోలీసులు పరిష్కరించారు. చాలామంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా వినియోగిస్తున్న వారి సంఖ్య అతి తక్కువ. పగలు, రాత్రితో సంబంధం లేకుండా పనిచేసే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అంటున్నారు.
ఎస్‌ఓఎస్...
విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్‌ఓఎస్’విభాగం ఏర్పాటైంది. ‘హాక్–ఐ’లో ఉన్న ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’అన్నది నొక్కడం ద్వారా దీని షార్ట్‌కట్ మొబైల్ స్క్రీన్‌పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్‌ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు... కంట్రోల్ రూమ్, జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీతో పాటు సమీపంలోని పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. వినియోగదారుడు పొందుపరిచిన ఐదు నంబర్లకూ సమాచారం వెళ్తుంది. ఓ సారి ‘ఎస్‌ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెస్‌చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ సమయం తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బా«ధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు.
‘వందకూ’వర్తింపు...
హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’డయల్ చేసి కాకుండా ఈ యాప్ ద్వారా సంప్రదించే ఆస్కారం ఏర్పడింది. హాక్–ఐ ద్వారా కాల్ చేస్తే... ఆ ఫిర్యాదుదారుల లోకేషన్ సైతం ఎస్‌ఓఎస్ వినియోగించిన వారి మాదిరిగానే కంట్రోల్ రూమ్స్‌లో స్క్రీన్స్‌పై కనిపించేలా సిటీ పోలీసు ఐటీ సెల్ ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మక దశలో ఉన్న దీని వినియోగంలో వచ్చే ఇబ్బందుల్ని అధికారులు ప్రస్తుతం గమనిస్తున్నారు.
క్రైమ్ ఎగెనెస్ట్ ఉమెన్...
మహిళల భద్రత కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగం ‘క్రైమ్ ఎగెనెస్ట్ ఉమెన్’. వారు పని చేసే ప్రాంతంలో, ప్రయాణించే మార్గంలో, ఇంట్లో... ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఈ విభాగాన్ని ఆశ్రయించవచ్చు. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఈ విభాగంలో ఉన్న ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషించే ఐటీ సెల్ ఫిర్యాదు స్వభావాన్ని బట్టి పోలీసులు, షీ–టీమ్స్, సైబర్ పోలీసులకు సమాచారమిస్తారు. అలాగే డయల్ ‘100’, పోలీసు ఫేస్‌బుక్, వాట్సాప్ (హైదరాబాద్:9490616555, సైబరాబాద్: 9490617444, రాచకొండ: 9490617111) ద్వారా ఎలాంటి సహాయం కావాలన్నా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment