భూదందా కోసమే ఎమ్మెల్యే పార్టీ మారాడు | He became a member of the party for land mafia | Sakshi
Sakshi News home page

భూదందా కోసమే ఎమ్మెల్యే పార్టీ మారాడు

Published Sat, Aug 29 2015 2:20 AM | Last Updated on Tue, Oct 30 2018 4:40 PM

He became a member of the party for land mafia

మంచిరెడ్డి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి  గెలవాలి
విలేకరుల సమావేశంలో మల్‌రెడ్డి రంగారెడ్డి ధ్వజం

 
 ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన భూదందా కోసమే అధికార టీఆర్‌ఎస్‌లో చేరాడని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలో చేస్తున్న అక్రమ భూదందాలకు అడ్డుకట్టు వేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని డాగ్ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభివృద్ధి పేరుతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరాడని ఆరోపించారు.

కరీముల్లాఖాన్ భూములకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం భూసేకరణకు నోటీసు ఇచ్చిందని, అయినా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన పలుకుబడితో తన చెంచాల(అనుచరుల) పేరు మీద అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకుంటారని ప్రశ్నించారు. ఒకవైపు సాధారణ ప్రజలకు కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహాసీల్దార్ కార్యాలయాలల్లో వారం రోజుల సమయం పడుతుంటే కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి సర్వే చేయకుండా మూడు రోజుల్లో సదరు భూమికి సంబంధించిన ఓఆర్‌సీ ఇవ్వటం ఏమిటని దుయ్యబట్టారు. భూదాన్ బోర్డు పరిహారం విషయంలో ఏపీఐఐసీ గతంలో కరీముల్లాఖాన్ వారసులకు రూ. 18 కోట్లు ఇచ్చిందని తెలిపారు.

కరీముల్లాఖాన్ వారసులు లేకపోవడంతో ఆ పరిహారం వెనుతిరిగిందని చెప్పారు. మరిప్పుడు కరీముల్లాఖాన్‌కు కొత్తగా వారసులు ఎలా వచ్చారని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. సర్కార్ కరీముల్లాఖాన్ భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. పట్నం అంగట్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పశువులాగా అమ్ముడుపోయి అక్రమ భూదందాకు తెర లేపాడని ధ్వజమెత్తారు. సొంత పార్టీ నాయకులే కిషన్‌రెడ్డితో వేగలేమని చెబుతుంటే.. ఆయన తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. పట్నం ప్రజల ఉసురు ఎమ్మెల్యేకు తగులుతుందని చెప్పారు.

కృష్ణా నది జలాలతో పట్నం చెరువును నింపి సస్యశామలం చేస్తామన్న ఎమ్మెల్యే.. నామమాత్రంగా రెండు రోజులు నీళ్లు వదిలి ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలవాలని మల్‌రెడ్డి రంగారెడ్డి సవాల్ విసిరారు. సమావేశంలో మంచాల జెడ్పీటీసీ సభ్యులు భూపతిగల్ల మహిపాల్, మాజీ ఎంపీపీ కృపేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిట్టు కృష్ణ. ఎమ్‌ఆర్‌ఆర్ యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు బుర్ర మహేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు మొద్దు కరుణాకర్‌రెడ్డి, నాయకులు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, పట్నం శివశంకర్, జైపాల్‌రెడ్డి, భాస్కరాచారి, గౌస్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement