పంటను చూస్తూ పాణం వదిలాడు | he dead by looking crop | Sakshi
Sakshi News home page

పంటను చూస్తూ పాణం వదిలాడు

Published Sat, Oct 18 2014 12:16 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పంటను చూస్తూ పాణం వదిలాడు - Sakshi

పంటను చూస్తూ పాణం వదిలాడు

వరుసగా పంట నష్టం.... ఈసారైనా తెల్ల‘బంగారం’ ఆశలు తీరుస్తుందని భావించాడా రైతన్న. అయితే తీవ్ర వర్షాభావంతో పంట కళ్లముందే ఎండిపోవడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కూడా కనిపించని పరిస్థితుల్లోగుండె చెదిరిన ఆ రైతు పత్తి చేనులోనే కుప్పకూలిపోయాడు. ఈ విషాదకర సంఘటన గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
 
గజ్వేల్: గజ్వేల్ గ్రామానికి చెందిన మామిడాల కిష్టయ్య(48)కు నాలుగెకరాలు భూమి ఉంది. వ్యవసాయం తప్ప మరొకటి తెలియని కిష్టయ్య ఏటా పంటలేయడం..అవి ఎండిపోయి నష్టాలు మిగలడం పరిపాటిగా మారింది. కేవలం సాగునీరు లేకపోవడం వల్లే నష్టాలొస్తున్నాయని భావించిన కిష్టయ్య గతేడాది రెండు బోరుబావులు వేసినా చుక్కనీరు పడలేదు. కుటుంబపోషణ, పంటల పండక రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి.

అయినప్పటికీ ఈసారైనా భూమాత కరుణిస్తుందన్న ఆశతో కిష్టయ్య మూడెకరాల్లో పత్తి, మరో ఎకరాలో మొక్కజొన్న సాగు చేశాడు. పత్తి బాగా పండితే అప్పులన్నీ తీర్చేయాలని భావించాడు. అందువల్లే పంటను బిడ్డలా కాపాడుకున్నాడు. కానీ తీవ్ర వర్షాభావం కిష్టయ్య అంచనాలను తలకిందులు చేసింది. పత్తి పంట పూర్తిగా దెబ్బతినింది. దీంతో కిష్టయ్య కుంగిపోయాడు. అప్పులు ఎలా తీర్చాలంటూ  మదన పడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం పత్తి చేనువద్దకు వెళ్లిన కిష్టయ్య ఎండిపోయిన పంట చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

గుండెపోటుతో పానంలా చూసుకున్న పొలంలోనే పాణం విడిచాడు. ఇది గమనించిన సమీప పొలాల రైతులు వెంటనే గజ్వేల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా...అప్పటికే కిష్టయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య పద్మ, కుమారుడు సాయికుమార్‌లు ఉన్నారు. కూతురు శీరిషకు నాలుగేళ్ల క్రితం వివాహం చేసిన కిష్టయ్య కుమారున్ని ఎంటెక్ చదివిస్తున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో ఆయన  మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న గజ్వేల్ తహశీల్దార్ బాల్‌రెడ్డి కిష్టయ్య ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. గుండెపోటుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ పాపం సర్కార్‌దే: సునీతారెడ్డి
సర్కార్ చేతగాని తనం వల్లే రైతన్నల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాత్రి గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో గుండెపోటుతో మృతిచెందిన రైతు మామిడాల కిష్టయ్య కుటుంబీకులను ఆమె పరామర్శించి ఓదార్చారు. ఈ సంద్భరంగా టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలన్నింటికీ జీఓ నెం.421 ప్రకారం ఎక్స్‌గ్రేషియాను సాధించేందుకు రాజకీయాలకతీతంగా టీడీపీతో ఇతర పార్టీలతో కలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామన్నారు.

రైతు ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం, ఏడు గంటల విద్యుత్ సరఫరాలో విఫలమవడం వల్లే రైతు ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, కొత్త రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయని రైతులు భావిస్తే, వారి అంచనాలు తలకిందులయ్యాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ కార్యదర్శి చాడ రామరాజుపంతులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్ధార్‌ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుంటుకు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
 
సీఎం ఇలాకాలో రైతు ఆత్మహత్యలా?

జగదేవ్‌పూర్: సీఎం ఇలాకాలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కేసీఆర్ పరిపాలనకు అద్దం పడుతోందని డీసీసీ అధ్యక్షురాలు సునీతాలకా్ష్మరెడ్డి అన్నారు. మండలంలోని నర్సన్నపేట గ్రామంలో అప్పు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కొండయ్య కుటుంబాన్ని శుక్రవారం ఆమె పరామర్శించారు. రైతు భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు, తల్లి ఎల్లవ్వలను ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. రైతు ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 250 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. జిల్లాలో 60 మంది రైతులు అప్పుల బాధతో తనువు చాలిస్తే, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం శోచనీయమన్నారు. కొత్త రాష్ర్టంలో నీరు, కరెంట్, సక్రమంగా అందుతాయన్న కలలు గన్న రైతులు కాటికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దదిక్కు ఆత్మహత్యతో ఆధారం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

లేకపోతే రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. అనంతరం నెల రోజల క్రితం నర్సన్నపేటలోనే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బాల్‌రెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ములుగు ఎంపీపీ వెంకటారామిరెడ్డి, శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, సర్దార్‌ఖాన్, భానుప్రకాష్‌రావు, పలువురు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement