మద్యం మత్తులో ‘హెడ్’ వీరంగం!
పుల్‌కల్ : ఓ హెడ్ కానిస్టేబుల్ పూటుగా తాగి నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించాడు. దీంతో 45 నిమిషాల పాటు రాకపోకలను స్తంభింపజేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పుల్‌కల్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పుల్‌కల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లయ్య రాత్రి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఫుల్‌గా మందుకొట్టాడు. పుల్‌కల్ బస్‌స్టాండ్ వద్ద మంతూర్ నైట్ హాల్ట్ బస్సు రాత్రి 10.15 నిమిషాలకు వచ్చింది.
దీంతో బస్సు డ్రైవర్ కిరాణం షాపులో పెరుగు తీసుకునేందుకు బస్సును ఆపాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మరో కారు పార్కు చేసి ఉంది. ఈ క్రమంలో కారులో వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ రోడ్డుపై వాహనాన్ని ఆపి ఎలా వెళ్లాలి అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై బూతు పురాణం మొదలు పెట్టాడు. ఇంతలోనే మరో వాహనం వచ్చింది. ఆ వాహనడ్రైవర్ పక్క నుంచి వెళ్లేందుకు యత్నించగా.. స్థలం లేకపోవడంతో అక్కడే నిలిచిపోయాడు. అంతే.. హెడ్‌కు కోపం వచ్చింది. అప్పటి వరకు బస్సు డ్రైవర్‌పై కస్సుమన్న అతను మరో వాహన డ్రైవర్‌నూ వదలలేదు.
వాహనాన్ని స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో.. అయితే తన వద్ద వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని, ఎందుకు స్టేషన్‌కు రావాలని వాదించడంతో.. అంత వరకు నోరును పారేసుకున్న హెడ్‌కానిస్టేబుల్.. చేతికి పని చెప్పేంత పని చేశాడు. ఇంతలో అక్కడున్న వారు ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆమె వెంటనే స్థానిక ఎస్‌ఐకి ఫోన్ చేసి పుల్‌కల్ బస్టాండ్‌లో ఏం జరుగుతుందో తనకు పది నిమిషాల్లో తెలపాలని ఆదేశించించారు. దీంతో స్టేషన్ నుంచి సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకుని హెడ్‌కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లారు.
ఈ తతంగం పూర్తి అయ్యేందుకు సుమారు రాత్రి 11 గంటలైంది. బాధ్యత గత పోలీసులే ఇలా తాగి రోడ్డుపై వాహనాన్ని నిలిపివేయడంతో మంతూర్, సింగూర్, పెద్దారెడ్డిపేట గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయణికులు రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ విషయమై ఎస్‌ఐ లోకేష్‌ను వివరణ కోరగా.. హెడ్ కానిస్టేబుల్ నుంచి వివరణ తీసుకుని నివేదిక పంపాలని ఎస్పీ సూచించినట్లు ఆయన వివరించారు. ఎస్పీ సూచన మేరకు తగిన చర్యలుంటాయన్నారు.