నవజాత శిశువులకు వినికిడి సమస్యలు శాపంగా మారుతున్నాయి. దేశంలో ప్రతి 1,000 మందిలో 300 మందికి వినికిడి సంబంధిత సమస్యలున్నట్లు కాక్లియర్ ఇండియా సంస్థ తాజా సర్వేలో తేలింది. ఇటు ఆస్పత్రులు, అటు తల్లిదండ్రుల్లోనూ వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించాలన్న స్పృహ లేకపోవడంతో... చిన్నారుల బంగారుభవిష్యత్తుపై వినికిడి లోపాలు దుష్ప్రభావం చూపుతున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు మినహా మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రసూతి కేంద్రాలు, ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లలో వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించే ల్యాబ్‌లు లేకపోవడం చిన్నారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరీక్షల విషయంలో కేరళ ఆదర్శంగా నిలుస్తోందని సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రంలో సామాజిక భద్రతా మిషన్‌లో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్లలో నవజాత శిశువులకు వినికిడి సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో నవజాత శిశువులకు వినికిడి సంబంధ పరీక్షలను సమగ్రంగా నిర్వహిస్తున్నారని వెల్లడించింది. ఈ నెల 3న ప్రపంచ వినికిడి దినోత్సవం (వరల్డ్ హియరింగ్ డే) సందర్భంగా ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది.
ఇలా గుర్తించాలి..
శిశువు జన్మించిన 24 గంటల తరవాత తొలిసారిగా వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించాలి. ఆ తరువాత మరో ఆరు నెలలకు ఈ పరీక్షలను విధిగా నిర్వహించాలి. కానీ పలు నగరాల్లో ఈ పరిస్థితి లేదు. దీంతో చిన్నారులకు రెండేళ్లు వచ్చే వరకు దీనిపై నిర్లక్ష్యం చేయడంతో సమస్య జఠిలంగా మారుతోందని ఈ సర్వేలో తేలింది. చాలా మంది తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకపోవడం శాపంగా మారుతోందని, నవజాత శిశువుల్లో వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రతి ఆస్పత్రి, ప్రసూతి కేంద్రాల్లో అటో అకౌస్టిక్ ఎమిషన్స్, ఆడిటర్ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ లాంటి పరికరాలతో ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకు కేవలం రూ.4 లక్షలు మాత్రమే వ్యయమవుతుందని ఆడియాలజీ నిపుణురాలు విష్ణుప్రియ ‘సాక్షి’కి తెలిపారు. 50 శాతం వినికిడి సమస్యలను నివారించేందుకు శిశువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం, స్క్రీనింగ్ చేయించడం, అధిక ధ్వనులు చిన్నారులు వినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్వే సూచించింది.
ప్రధాన కారణాలు..
♦ జన్యుపరంగా పుట్టుకతో వచ్చే లోపాలు.
♦ మాతృత్వ సమయంలో తల్లులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం.
♦ చిన్నారులు గాయాలు, ప్రమాదాల బారినపడడం.
♦ గర్భిణులు, చిన్నారులు అధిక శబ్దాలు వినడం.
♦ గర్భిణులు విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్, ఆటోటాక్సిక్ డ్రగ్స్ వినియోగించడం.
♦ చిన్నారులు మీజిల్స్, మమ్స్ బారినపడడం.
సర్వే ఫలితాలివీ...
♦ ప్రతి వెయ్యి మందిలో 5–6 మంది పుట్టుకతోనే వినికిడి సమస్యతో జన్మిస్తున్నారు.
♦ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు చాలామంది తల్లిదండ్రులు వినికిడి సమస్యను గుర్తించడం లేదు.
♦ 84 శాతం మంది తల్లులు తమ చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహించేందుకు సమ్మతించినా.. ఎక్కడా ఇందుకు సంబంధించిన పరికరాలు లేకపోవడం గమనార్హం.
♦ 75 శాతం మంది తల్లులు ఈ సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమస్య జఠిలం కాకుండా ఉంటుందని భావిస్తున్నారు.
♦ చెవిలో తలెత్తే ఇన్‌ఫెక్షన్లే వినికిడి సమస్యలకు ప్రధాన కారణమని తల్లులు భావిస్తున్నారు.
♦ ప్రతి 10 మంది తల్లుల్లో ముగ్గురు వినికిడి సమస్యలున్న తమ చిన్నారులు ఇతర చిన్నారుల్లా సాధారణ జీవితం గడపలేరని భయాందోళనలకు గురవుతున్నారు.
♦ చిన్నారులకు వినికిడి సమస్య ఉందని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తున్నారు. అదనపు సమాచారం కోసం ఆన్‌లైన్‌లోనూ శోధిస్తున్నారు.
♦ ప్రపంచ జనాభాలో సుమారు 5 శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు.
♦ ప్రపంచవ్యాప్తంగా 360 మిలియన్ల మంది బాధితులు ఉండగా.. ఇందులో 91 శాతం పెద్దలు, 9శాతం చిన్నారులు.
♦ 1.10 బిలియన్ల యువత తాము వినియోగించే హెడ్‌ఫోన్స్, మ్యూజిక్ ఉపకరణాలతోనే ఈ సమస్యలో చిక్కుకున్నట్లు తేలింది.
వినికిడి సమస్యలు..
♦ చిన్నారులు సరిగా మాట్లాడలేకపోవడం.
♦ మాతృభాష ఉచ్ఛారణ సరిగా లేకపోవడం.
♦ భవిష్యత్‌లో చదువులో చురుగ్గా రాణించలేకపోవడం. ఉపాధ్యాయులతో సరిగా మాట్లాడలేకపోవడం.
♦ ఇతర పిల్లలతో కలిసి ఉండకపోవడం.
Comments
Please login to add a commentAdd a comment