
ఒకే సమయంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి
ప్రైమరీ ఫల్మొనరీ హైపర్‌టెన్షన్‌తో దెబ్బతిన్న గుండె, లంగ్స్
నిజామాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు యశోదలో చికిత్స
సాక్షి, హైదరాబాద్: ఆడుతూ పాడుతూ చలాకీగా కనిపించిన బాలిక అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించగా... వైద్యులు ఆమెకు ఒకే సమయంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీఎస్ రావు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీ నరేష్‌కుమార్ చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా చికిత్స ఇదే తొలిదని తెలిపారు.
స్కూల్లో కుప్పకూలిన బాలిక...
నిజామాబాద్ జిల్లా దర్పల్లికి చెందిన రైతు సీహెచ్ రాములు, లక్ష్మిల కుమార్తె నితిష (13) అదే ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. జనవరి 4న ఉదయం స్కూల్లో ప్రార్థన చేస్తుండగా... స్పృహతప్పి పడిపో యింది. వెంటనే ఆమెను నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు నితిషను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. గుండె దడ, ఛాతీలో తీవ్ర అసౌకర్యంతో బాధపడుతున్న బాలికను పరీక్షించిన సీనియర్ కార్డియాలజిస్ట్ నరేష్‌కుమార్... ఆమెకు ‘ప్రైమరీ ఫల్మొనరీ హైపర్‌టెన్షన్’ ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు.
27 ఏళ్ల యువతి అవయవాల సేకరణ...
వైద్య ఖర్చులు భరించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేయగా, ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది. జనవరి 19న గుండె, ఊపిరితిత్తుల దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేయించారు. ఇదే సమయంలో మెదడులో రక్తస్రావంతో బాధపడుతూ అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 27 ఏళ్ల యువతి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుంది. ఆ యువతి అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించారు. దీంతో డాక్టర్ నరేష్‌కుమార్ నేతృత్వంలోని 20 మంది వైద్యుల బృందం చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
8 గంటలపాటు చికిత్స..
అవేర్ ఆస్పత్రి నుంచి గ్రీన్ చానల్ ద్వారా యశోదకు యువతి అవయవాలు తరలించారు. వెంటనే వాటిని బాలికకు అమర్చారు. మార్చి 26 తెల్లవారుజాము 3.45కు ప్రారంభమైన శస్త్రచికిత్స.. ఉదయం 11.30 వరకు కొనసాగింది. 8 గంటలపాటు శ్రమించిన వైద్యులు బాలికకు గుండె, ఊపిరితిత్తులను విజయవంతంగా అమర్చారు. 2 వారాలు ఐసీయూలో చికిత్స పొందిన బాలిక ప్రస్తుతం కోలుకుందని, ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. పైసా కూడా తీసుకోకుండా తన బిడ్డకు ఖరీదైన వైద్యం చేసిన యశోద వైద్యులకు బాధితురాలు నితిష, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.