గోదావరిలో తగ్గుతున్న వరద ఉధృతి
సాక్షి, బోధన్ (నిజామాబాద్): బోధన్ మండలంలోని సాలూర శివారులో గల మంజీర నదిలో జలకళ సంతరించుకుంది. రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో మంగళవారం సాలూర శివారులోని పాత బ్రిడ్జ్ ఎత్తు వరకు నదిలో నీరు ప్రవహించింది. వరద నీటితో మంజీరకు జలకళ సంతరించుకోవడంతో మంజీర బ్రిడ్జ్ పై నుంచి బోధన్, మహారాష్ట్ర కు ప్రయాణాలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు కొద్దిసేపు ఆగి జల ప్రవాహాన్ని వీక్షిస్తున్నారు. యువత సెల్ఫీలు తీసుకుంటు సందడి చేస్తున్నారు. ఈ జల ప్రవాహంతో దిగువ ప్రాంతం రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తేలిన శివాలయం, గోదావరికి తగ్గుతున్న వరద ఉధృతి
రెంజల్ : రెండు రోజులు నిలకడగా సాగిన గోదావరి నదిలో వరద ఉధృతి మంగళవారం తగ్గింది. రెండు రోజుల కిందట కందకుర్తి పుష్కరక్షేత్రంలోని నదిలో గల పురాతన శివాలయం ముందు గల నంది విగ్రహం పూర్తిగా వరద నీటితో మునగగా మంగళవారం పూర్తిగా వరద నీరు తగ్గింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది వరద నీటితో పరవళ్లు తొక్కింది. వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. ఎగువన గల మహారాష్ట్రతో పాటు మంజీర, హరిద్ర నదుల నుంచి నీరు కిందికి చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment