కాలనీళ్లు | heavy problems in rainy season for colony residents | Sakshi
Sakshi News home page

కాలనీళ్లు

Published Wed, Jun 17 2015 4:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

కాలనీళ్లు

కాలనీళ్లు

- ఇళ్లను ముంచెత్తుతున్న మురుగునీరు
- కాలనీ వాసులకు ఏటా తప్పని కష్టాలు
- గ్రేటర్‌లో 4600 కి.మీ. మేర మురుగునీటి పైప్‌లైన్లు
- సరిగా సాగని పూడికతీత పనులు
- చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు
సాక్షి,సిటీబ్యూరో:
వాన పేరు వింటే నగరంలోని బస్తీ జనాలు హడలిపోతున్నారు. చినుకు పడితే వణికిపోతున్నారు. ఏవైపు నుంచి ఏ నాలా పొంగి ఇళ్ల మీదకు వస్తుందోనని భీతిల్లుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ పరిధిలోని మురుగునీటి కాల్వలు, నాలాలు ఉప్పొంగి సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయి. గత పక్షం రోజుల్లో మహా నగర పరిధిలో 138.2 మిల్లీమీటర్ల (దాదాపు 13.8 సెంటీమీటర్ల) వర్షపాతం నమోదైంది. నాలాల్లో పూడికతీత సరిగా లేకపోవడంతో ఈ నీరు వర్షపునీటితో కలసి ఇళ్లలోకి చేరుతోంది. మహా నగర వ్యాప్తంగా 4600 కి.మీ. మేర ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్లు, 1500 కి.మీ. విస్తరించిన నాలాలు, మరో 1.85 లక్షలు ఉన్న మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన మట్టి, చెత్తా చెదారం, పూడికను 60 శాతమే తొలగించారు. దీంతో ఈ దుస్థితి తలెత్తింది. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి.
 
ఎక్కడి మురుగు అక్కడే
వివిధ ప్రాంతాల్లో మూతలు లేని మ్యాన్‌హోళ్లలో తినుబండారాల దుకాణాల యజమానులు, బిల్డర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఫుట్‌పాత్ వ్యాపారులు, నిర్మాణ సామగ్రి, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ పేపర్లు, గ్లాసులు, చెత్తా చెదారం, మట్టితో నింపేస్తున్నారు. దీంతో డ్రైనేజీ లైన్లు పూడుకుపోయాయి. వర్షాలకు ఆయా ప్రాంతాల్లో మురుగు ముంచెత్తుతోంది. ఈ వేసవిలో సుమారు 1840 కి.మీ. మురుగునీటి పైప్‌లైన్లలో పూడికతీత పనులు అరకొరగా చేపట్టడంతో పరిస్థితి విషమించింది. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, జలమండలి క్షేత్రస్థాయి అధికారులకు, అత్యవసర కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతమాత్రమేనని శివారు వాసులు గగ్గోలు పెడుతున్నారు. గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని వందలాది కాలనీలు, బస్తీల్లో డ్రైనేజి ఔట్‌లెట్ సదుపాయాలు లేవు. దీంతో వర్షం పడిన ప్రతిసారీ వాన నీటితో కలిసిన మురుగునీరు నివాసాలను ముంచెత్తుతుండడం గమనార్హం.
 
ఇదీ నాలాల దుస్థితి
నగరంలో వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. వర్షం కురిస్తే నీరు సాఫీగా వెళ్లే మార్గం లేకపోవడం. నాలాలపైనే అంతస్తులకు అంతస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. వీటి అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఏళ్లకేళ్లుగా పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో జనం ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా మూసీ కాలువలో పడి తరుణ్(7) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇటీవల సీఎం నగర పర్యటనలో, స్వచ్ఛ కమిటీ సమీక్షలో సైతం నాలాల దుస్థితినే ప్రజలు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో నష ్టనివారణకు స్వల్ప, దీర్ఘకాలికంగా వీటి అభివృద్ధి పనులు చేయాలని భావించారు. దీనిపై స్వచ్ఛ కమిటీ చేసిన సిఫారసులు కాగితాలకే పరిమితమయ్యాయి.
ఇవీ కమిటీ సిఫారసులు
- నాలాల విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికి నష్ట పరిహారం తగినంత ఇవ్వాలి.
- ఇల్లు పూర్తిగా కోల్పోయే వారికి కొత్త ఇల్లు ఇవ్వాలి.
- ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలి.
- ప్రైవేటు భూములకు కొత్త చట్టం మేరకు నష్ట పరిహారం చెల్లించాలి.
- సత్వర భూసేకరణకు డిప్యూటీ కలెక్టర్ నేతత్వంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా  భూసేకరణ విభాగం ఏర్పాటు.
- 26 కి.మీ. మేర ఉన్న మేజర్ బాటిల్ నెక్స్‌ను గుర్తించి ప్రథమ ప్రాధాన్యంతో పనులు చేపట్టాలి. ఆస్తులు కోల్పోయే వారికి దాదాపు రూ.223 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
- సివరేజి నాలాల్లోకి  చేరకుండా వాటర్ బోర్డు చర్యలు తీసుకోవాలి.
- ఏటా నాలాల్లో డీసిల్టింగ్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితి షరా మామూలే. చెత్తను నాలాల్లో వేస్తుండటంతో పరిస్థితులు మొదటికొస్తున్నాయి.
- బల్కంపేట్, గ్రీన్‌పార్క్ హోటల్, ధరమ్‌కరణ్ రోడ్, మహబూబ్ కాలేజ్, బైబిల్ హౌజ్, ఫీవర్ ఆస్పత్రి, అంబర్‌పేట్, మిశ్రీగంజ్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు సమీప కాలనీలు, బస్తీలు, రహదారులను ముంచెత్తుతోంది.
- చెత్త, మురుగునీరు నాలాల్లో చేరకుండా చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నాలాల వద్ద ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయాలి.
- నాలాలను ఏడాది పాటు సక్రమంగా నిర్వహించేలా కాంట్రాక్టు ఇవ్వాలి. వాటిని తగినంత వెడల్పు చేయాలి. ఇవన్నీ అమలైతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని స్వచ్ఛ కమిటీ తేల్చింది.
 
నదిని తలపించేలా...
ఖైరతాబాద్:
ఖైరతాబాద్ రైల్వే గేటు ప్రధాన రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లడంతో రోడ్డు పొడవునా నీరు నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నీరు నిలవడంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి ఖైరతాబాద్ ప్రధాన రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ కూరుకుపోవడంతో వాటర్‌వర్క్స్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉదయం చింతల్‌బస్తీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని అటువైపు వె ళ్లకుండా రైల్వేగేటు సమీపంలోని మరో మ్యాన్‌హోల్ వద్ద అడ్డుకట్ట వేశారు. దీంతో నీరు రోడ్డుపై నిలిచిపోయింది. ఎట్టకేలకు ఆ నీటిని ఇంకో మ్యాన్‌హోల్ ద్వారా మళ్లించారు. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని మెరుగుపరచాలనివైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్.బ్రహ్మయ్య కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement