గ్రామస్తులను వేధించొద్దు!
- వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో 144 సెక్షన్‌పై హైకోర్టు
- ఆ సెక్షన్ పరిధిని విస్తరించడం ప్రజల హక్కుల్లో జోక్యం చేసుకోవడమే
- పరిధి దాటి నిషేధాజ్ఞలు విధించారనేందుకు ఆధారాలున్నాయి
- ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చు.. శాంతియుతంగా సమావేశం కావొచ్చు
- రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలోని వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి.. అక్కడి ప్రజల స్వేచ్ఛాయుత కదలికలను అడ్డుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇది వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశాల్లో భయానక వాతావరణం కల్పించడం, బెదిరించడం, బలవంతం చేయడం వంటి వాటిని అనుమతించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. శాంతి భద్రతలు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ మధ్య సమతౌల్యం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. అంతేగానీ 144 సెక్షన్ పరిధిని విస్తరింప చేయడానికి వీల్లేదని... అలా చేస్తే గ్రామస్తులనే గాక, ఆ గ్రామాల్లోకి రావాలనుకునే బయటి వ్యక్తులను కూడా వేధించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఈ రెండు గ్రామాల ప్రజలను స్వేచ్ఛగా తిరగనివ్వాలని.. గుర్తింపుకార్డుల కోసం ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది.
స్వేచ్ఛగా తిరగనివ్వాలి..
వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ వై.సంతోష్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించారు. ‘‘144 సెక్షన్‌ను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో ఆ ఉద్దేశం కోసమే అధికారులు అమలు చేయాలి. ఈ రెండు గ్రామాల ప్రజలు, గ్రామాల్లోకి రావాలనుకునే బయటి వ్యక్తుల హక్కుల్లో జోక్యం చేసుకోరాదు. ఈ గ్రామాల ప్రజలు స్వేచ్ఛాయుతంగా తిరగవచ్చు. వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం స్వేచ్ఛగా సరుకులను తరలించుకోవచ్చు. వ్యవసాయ కార్యకలాపాల నిమిత్తం పొలాల్లోకి వెళ్లొచ్చు.
స్వేచ్ఛాయుతంగా తిరిగేందుకు గుర్తింపు కార్డులు చూపాలని, వారి కదలికలను తెలియచేయాలని ఒత్తిడి చేయరాదు. శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశం లేనివారిని.. మారణాయుధాలు ధరించని వారిని గ్రామాల్లోకి రాకుండా నిషేధం విధించొద్దు. కర్రలు, కత్తులు, ఇతర ప్రమాదకర ఆయుధాలు, లాఠీలు చేపట్టి ముగ్గురు, నలుగురు వ్యక్తులు గుమిగూడటం వంటి వాటిపై నిషేధం విధించడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. ఆ మేరకు 144 సెక్షన్ ఉత్తర్వును సమర్థిస్తున్నా. కానీ గ్రామస్తులు ఆరోపిస్తున్న విధంగా ఈ సెక్షన్‌ను అడ్డం పెట్టుకుని హక్కులను హరించడానికి ఏమాత్రం వీల్లేదు..’’ అని రెవెన్యూ, పోలీసు అధికారులకు న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అధికారులు పరిధి దాటారు
144 సెక్షన్ పరిధిని మించి నిషేధాజ్ఞలు విధించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలు సహేతుకంగా ఉండేలా చూసే అధికారం న్యాయస్థానాలకు ఉందన్నారు. ‘‘144 సెక్షన్ విధింపు ఉత్తర్వులో పేర్కొన్న విషయాల్లో వాస్తవం లేదని, శాంతియుతంగా ఊరేగింపు జరుగుతుండగా పోలీసులు లాఠీచార్జి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.. అయితే ఈ వివాదాస్పద అంశం జోలికి వెళ్లి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై కోర్టు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు. శాంతియుత వాతావరణం దెబ్బతినే ప్రమాదముందన్న తహసీల్దార్ వాదనలు సరైనవే అనుకున్నా కూడా.. సెక్షన్ 144 విధించే పరిస్థితి తలెత్తలేదు..’’ అని తీర్పులో పేర్కొన్నారు.
ఆ గ్రామాలకు అలాంటి చరిత్రేమీ లేదు
144 సెక్షన్ విధించిన వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలకు తీవ్రవాదుల కార్యకలాపాలు, హింస, మత ఘర్షణలు వంటివి చోటుచేసుకున్న చరిత్ర లేదని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ గ్రామాలు రక్షణపరంగా, పరిశోధనపరంగా నిషేధం ఉండి.. గ్రామస్తులు, బయట వ్యక్తులు గుర్తింపు కార్డులు చూపే పరిస్థితుల్లో ఉన్నవి కూడా కాదని స్పష్టంచేశారు. అందువల్ల గ్రామస్తుల కదలికల వివరాల కోసం ఒత్తిడి చేయడం, గుర్తింపు కార్డులు చూపాలనడం తన దృష్టిలో వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఏకాంత హక్కు (రైట్ టు ప్రైవసీ)లో జోక్యం చేసుకోవడమేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. గ్రామస్తుల కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, వ్యవసాయ, వ్యాపార సంబంధాలున్న వారిని సాధారణ పరిస్థితుల్లో లాగానే ఈ గ్రామాల్లోకి అనుమతించాలని ఆదేశించారు.