
సాక్షి, హైదరాబాద్: పిల్లలు తప్పు చేస్తే వారిని సంస్కరించే దిశగా క్షమాగుణంతో చర్యలు, శిక్షలు ఉండాలని వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు హైకోర్టు హితవు చెప్పింది. తప్పు చేసిన విద్యార్థుల్లో మార్పు వచ్చేలా వారికి శిక్షలు ఉండాలని సూచన చేసింది. ఓ విద్యార్థిని సస్పెండ్ చేసిన వ్యవహారంపై హైకోర్టు స్పందిస్తూ.. సెనేట్ నిర్ణయం తీసుకునే వరకూ ఆ విద్యార్థిని తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిచ్చే విషయంలో నిట్ తన వైఖరిని తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం పేర్కొంది.
నిట్ తొలి ఏడాది విద్యార్థి గంజాయి వినియోగిస్తూ పట్టుబడటంతో ఆ విద్యార్థిని పరీక్షలకు అనుమతించకపోవడటంతోపాటుగా ఆ ఏడాదికి సస్పెండ్ చేస్తూ 2019 నవంబర్ 22న నిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా..ఈ విషయం సెనేట్ ముందు పెండింగ్‌లో ఉన్నందున మూడు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. సెనేట్ నిర్ణయం వెలువడే వరకూ తరగతులకు అనుమతించేలా ఉత్తర్వులివ్వాలని విద్యార్థి చేసిన అప్పీల్ పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం విచారించింది. వాదనల అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment