అసాధారణ కేసుల్లోనే బెయిల్ ఇవ్వాలి
- అధికరణ 226పై హైకోర్టు వ్యాఖ్య
- కారణాలను స్పష్టంగా వివరించాల్సిందే.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు
సాక్షి, హైదరాబాద్: అసాధారణ కేసుల్లో రాజ్యాంగంలోని 226 అధికరణ కింద బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉందని ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘అరుుతే ఈ అధికరణ కింద బెయిల్ ఉత్తర్వులను యాంత్రికంగా జారీ చేయడానికి వీల్లేదు. అది ఎందుకు అసాధారణ కేసో, ఎందుకు బెరుుల్ ఇవ్వాల్సి వచ్చిందో స్పష్టమైన కారణాలను వివరించాల్సిందే. కేసు మంచి చెడులను కూడా విధిగా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని తేల్చిచెప్పింది. ‘‘1. నిందితుడు నేరం చేశాడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నా యా? 2. నేరారోపణల తీవ్రత. 3. శిక్ష పడి ఉంటే దాని తీవ్రత 4. బెయిల్ ఇస్తే నిందితుడు పారిపోయే ఆస్కారముందా? 5. నిందితుని గుణగణాలు, హోదా 6. మరోసారి నేరం చేసే ఆస్కారముందా? 7. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదముం దా? 8. బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునే ఆస్కారముందా?’’ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. క్యూనెట్, విహాన్ కంపెనీల ప్రతినిధులకు బెయిల్ ఇవ్వాలని కింది కోర్టులను ఆదేశిస్తూ 226 అధికరణ కింద సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.
ఆ కంపెనీల ప్రతినిధులకు బెయిలిచ్చే విషయంలో కేసు పూర్వాపరాలు, స్వీయ విచక్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారంటూ క్యూనెట్, దాని అనుబంధ సంస్థ విహాన్ కంపెనీల ప్రతినిధులు మైఖేల్ జోసెఫ్ ఫెరీరా, మాల్కమ్ ఎన్.దేశాయ్, ఎం.వి.బాలాజీ, శ్రీనివాసరావు వంకా తదితరులపై ఉభయ రాష్ట్రాల్లోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యారుు. వీటిపై వారు హైకోర్టును ఆశ్రరుుంచగా, వారికి బెయిల్ మంజూరు చేయాలని కింది కోర్టును ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాలు చేస్తూ తెలంగాణ హోం శాఖ ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘‘బెరుులివ్వాలని ఉత్తర్వులు జారీ చేసిన సింగిల్ జడ్జి, అందుకు దారి తీసిన కారణాలను మాత్రం వాటిలో వివరించలేదని హోం శాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ వాదనలతో ఏకీభవిస్తున్నాం’’ అని తీర్పులో పేర్కొంది.