సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొందరు విద్యార్థులకే పరిమితం చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గత నెల 11న జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమ వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, సాంఘిక సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. ఆయా కాలేజీల్లో మొత్తం మూడు పద్ధతుల్లో సీట్లను భర్తీ చేయడం జరుగుతోంది. కన్వీనర్ నిర్వహించిన ఎంసెట్‌లో కన్వీనర్ ద్వారా భర్తీ చేసే సీట్లను సింగిల్ విండో 1 అంటారు. కన్వీనర్ నిర్వహించిన ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఆయా కాలేజీలు భర్తీ చేసేలా సీట్లను సింగిల్ విండో 2గా, ఆయా కాలేజీలు ఎంసెట్ నిర్వహించుకుని సీట్లను భర్తీ చేయడం సింగిల్ విండో 3గా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది ప్రవేశాల సమయంలో ఆయా కాలేజీలు ఈ మూడు విధానాల్లో ఓ విధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు విధానాల్లో దేని కిందైనా విద్యార్థులు చేరినప్పటికీ అర్హులైన వారికి మొదటి నుంచీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపచేస్తున్నారు.
జీవోకు తూట్లు
గత నెల 11న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ, కేవలం సింగిల్ విండో 1 కింద ప్రవేశాలు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పరిమితం చేశారు. సిం గిల్ విండో 2, 3 కింద ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ వారి నుంచి హామీ తీసుకోవాల ని ఆయా కాలేజీలను ఆదేశించారు. ఈ ప్రొసీ డింగ్స్‌ను సవాలు చేస్తూ అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.వి.కె.రావు, మరికొన్ని కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ జీవోలో కానరాని వివక్ష
పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ జీవోలో ఎక్కడా కూడా విద్యార్థుల పట్ల వివక్ష చూపలేదన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింప చేసిందని ఆయన తెలిపారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తన ప్రొసీడింగ్స్ ద్వారా ప్రభుత్వ జీవోకు తూట్లు పొడుస్తున్నారని వివరించారు. ఈ ప్రొసీడింగ్స్ ఫీజు రీయింబర్స్‌మెంట్ జీవో ఉద్దేశాలకు విరుద్ధమన్నారు. ఆయా కాలేజీలు ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేశాయని, ఈ దశలో ప్రొసీడింగ్స్ జారీ చేయడం సరికాదని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, గత నెల 11వ తేదీన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
ఉన్నత విద్యాశాఖ ప్రొసీడింగ్స్ నిలిపివేత
Published Tue, Jul 3 2018 1:46 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment