
హైదరాబాద్: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీగా మారింది. వేగంగా దూసుకొచ్చిన ఓ వోల్వో కారు డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొని ఆగిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కారులో ప్రముఖ సినీ నటుడు రాజ్‌తరుణ్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో సైతం ఆ సినీ నటుడి పోలికలు ఉన్న వ్యక్తి ఉండటంతో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది.
నార్సింగి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అల్కాపురి కాలనీ గుండా సోమవారం రాత్రి టీఎస్ 09 ఈఎక్స్ 1100 కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలో ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్లిపోయాడు. ఈ పూర్తి సంఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సంఘటన సమ యంలో రాజ్‌తరుణ్ కారులో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయమై నార్సింగి పోలీసులు మాత్రం ఎలాంటి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. ప్రస్తుతం విచారిస్తున్నామని చెబుతున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. కారు నంబర్ ఆధారంగా స్కేజోన్ యజమానికి సమాచారం అందించామని చెప్పారు. యజమాని అనుచరుడు ఫోన్‌లో సంప్రదించాడని, కానీ ఎలాంటి సమాచారాన్ని అందించలేదన్నారు.