ఆదాయం ఆరొందల కోట్లు | HMDA Bagayath Lands Online Auction Details | Sakshi
Sakshi News home page

ఆదాయం ఆరొందల కోట్లు

Published Tue, Apr 9 2019 7:00 AM | Last Updated on Tue, Apr 9 2019 7:00 AM

HMDA Bagayath Lands Online Auction Details - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కాసుల పంట పండింది. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్‌లకు మస్తు గిరాకీ వచ్చింది. సంస్థ లేఅవుట్‌ చేసిన 67 ప్లాట్‌లను ఈ–వేలం వేయగా మొత్తం రూ.677 కోట్ల ఆదాయం సమకూరింది. రెండు రోజుల పాటు జరిగిన ఆన్‌లైన్‌ వేలం సోమవారంతో ముగిసింది. తొలిరోజు 36 ప్లాట్‌లకు రూ.202 కోట్లు, రెండోరోజు 31 ప్లాట్‌లకు రూ.475 కోట్లు వచ్చాయి. రెండోరోజు నిర్వహించిన వేలంలో 492.77 గజాల ప్లాట్‌కు రూ.3,64,15,703 ఆదాయం వచ్చింది. రెండు రోడ్ల అనుసంధానం ఉన్న ఈ నార్త్‌వెస్ట్‌ ప్లాట్‌కు అత్యధికంగా గజానికి రూ.73,900 పలికింది. అత్యల్పంగా గజానికి రూ.36,600 పలికినా... తాము నిర్ణయించిన ధర (గజానికి రూ.28వేలు) కంటే అది ఎక్కువేనని హెచ్‌ఎండీఏ కార్యదర్శి రాంకిషన్‌ హర్షం వ్యక్తం చేశారు. 31 ప్లాట్‌లకు సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు సెషన్లలో జరిగిన ఈ–వేలాన్ని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తార్నాకలోని కార్యాలయంలో పర్యవేక్షించారు. ప్రతి ఒక్క ప్లాట్‌కూ మంచి గిరాకీ రావడంతో అంచనాకు మించి ఆదాయం సమకూరిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంతో ఎలాంటి సాంకేతిక సమస్య రాలేదన్నారు. 

తొలిరోజుతో పోలిస్తే తక్కువే...  
రెండోరోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 2,631 గజాలున్న 17 ప్లాట్‌ల వేలం జరగాల్సి ఉండగా... బిడ్డర్ల పోటీతో మధ్యాహ్నం 1:30గంటలకు పూర్తయింది. ఈ సెషన్‌లో అత్యధికంగా గజానికి రూ.50,700, అత్యల్పంగా రూ.42,100 పలికింది. మొత్తంగా చూస్తే గజానికి రూ.48,334 దక్కింది. ఈ సెషన్‌లో 17 ప్లాట్‌ల విక్రయం ద్వారా రూ.216,14,30,786 ఆదాయం వచ్చింది. 

తగ్గిన పోటీ...
మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలకు వరకు 14ప్లాట్‌లకు జరిగిన రెండో సెషన్‌ వేలంలో తొలిరోజు పోలిస్తే తక్కువ ధరకే బిడ్డర్లు కోట్‌ చేశారు. ఎందుకంటే  వేలల్లో గజాలుండడంతో ఆచితూచి వ్యవహరించారు. 2,600 నుంచి 8,431 గజాల వరకున్న ఈ 14 ప్లాట్‌ల ద్వారా రూ.258 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సెషన్‌లో అత్యధికంగా 2,631 గజాలున్న ప్లాట్‌ను గజానికి రూ.59,800... అత్యల్పంగా 8,431 గజాలున్న ప్లాట్‌ను గజానికి రూ.36,600 బిడ్డర్లు దక్కించుకున్నారు. మొత్తంగా ఈ సెషన్‌లో గజం రూ.47,000 పలికిందని హెచ్‌ఎండీఏ కార్యదర్శి రాంకిషన్‌ తెలిపారు.  

చిరంజీవులు చొరవ.. అర్వింద్‌ శ్రద్ధ  
2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ల్యాండ్‌పూలింగ్‌ కింద ఉప్పల్‌ భగాయత్‌ రైతుల నుంచి 733 ఎకరాలను హెచ్‌ఎండీఏ సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు శుద్ధి నీటి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ‘ఉప్పల్‌ భగాయత్‌’ పేరుతో లేఅవుట్‌ అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్‌సీ భూములు ఉండడంతో భూములు కోల్పోయిన రైతులకు ఆలస్యంగానైనా గతేడాది మార్చిలో 1,520 మంది రైతులకు లాటరీ రూపంలో ప్లాట్‌లు కేటాయించారు. ఎకరం భూమి కోల్పోయిన వారికి వేయి గజాల చొప్పున కేటాయించారు.

8,84,205 చదరపు గజాల్లో లేఅవుట్‌లు చేస్తే 7,58,242 చదరపు గజాలు 1,520 మందికి ప్లాట్‌లు ఇచ్చారు. వీరికిపోను అభివృద్ధి చేసిన 1,31,579.31 గజాల ప్లాట్‌లను విక్రయించగా రూ.676 కోట్ల ఆదాయం వచ్చింది. హెచ్‌ఎండీఏ మాజీ కమిషనర్‌ టి.చిరంజీవులు చూపిన ప్రత్యేక చొరవతో ఉప్పల్‌ భగాయత్‌ రైతులకు ప్లాట్‌ల పత్రాలిచ్చి మిగిలిన భూమిని లేఅవుట్‌గా అభివృద్ధి చేయడం తో ఇది సాధ్యమైందని సంస్థ వర్గాలు పేర్కొన్నా యి. అయితే గతేడాది సెప్టెంబర్‌ ఆఖరులో గుజరాత్‌కు చెందిన ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఈ–వేలం సాంకేతిక సమస్యలతో ఆగిపోవడంతో హెచ్‌ఎండీఏ ప్రస్తు ఇన్‌చార్జి కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్‌ల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement