ఆదాయపన్ను మినహాయింపుపై సింగరేణి కార్మికుల ఆశలు
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో పనిచేస్తున్న 64 వేల మంది కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయించాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఆవిర్భవించిన 125 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఆదాయ పన్ను మినహాయించాలని కేంద్రాన్ని కోరలేదు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ విషయమై చర్చ జరిగినా నిర్ణయం చేయలేదు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన విధం గా ఆదాయపు పన్ను నుంచి గని కార్మికులను మినహాయిం చాలని కేంద్రాన్ని కోరడం గొప్ప విషయమని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న 64 వేల మంది కార్మికులు ఏటా రూ. 260 కోట్లను ఆదాయపు పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలోకి వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికితీస్తున్న కార్మికులకు సైనికుల మాదిరిగా పన్ను రద్దు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది.
తీర్మానం అంగీకరిస్తారా?
పన్ను మినహాయించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రానికి పంపించినా అక్కడ అంగీకరిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేశంలో సింగరేణితోపాటు కోల్‌ఇండియాలో సుమారు నాలుగు లక్షలమంది గని కార్మికులు పనిచేస్తున్నారు. ఒకవేళ 64 వేల మంది సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తే కోల్‌ఇండియా కార్మికులకు కూడా ఇవ్వాల్సి వస్తుందని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆదాయపు పన్ను మినహయింపు కోరే అవకాశం ఉంది.
ప్రణాళిక సంఘం ఈ విషయమై అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. కానీ కేంద్రం తాజాగా ఆదాయపు పన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో గని కార్మికులకు ఈ పరిమితి మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల కూడా సగం మంది కార్మికులకు ప్రయోజనం చే కూరవచ్చు. ఏదేమైనా కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే మినహాయింపు ఆధారపడి ఉంది.