సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో టమాటా ధర రోజురోజుకూ పడిపోతోంది. ఒకటి రెండు నెలల కింద కిలో రూ. 100కు చేరి భయపెట్టిన టమాటా.. ఇప్పుడు ఐదు రూపాయలకు తగ్గి నేల చూపులు చూస్తోంది. వినియోగదారులకు తక్కువ ధరకే అందుతున్నా.. రైతులకు మాత్రం కిలోకు రూపాయి, రెండు రూపాయలు మాత్రమే దక్కుతోంది. ముందు ముందు టమాటా ధర ఇంకా పడిపోతుందనే అంచనాతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు లేకపోవడం, టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలేవీ లేకపోవడం వల్లే రాష్ట్రంలో టమాటా ధరలు విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అంటున్నారు.
దళారులకే గిట్టుబాటు!: రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. ప్రధానంగా వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో టమాటా విస్తారంగా సాగవుతుంది. ఇతర ప్రాంతాల్లోనూ కొద్ది మొత్తంలో సాగు చేస్తారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి అవుతుంది. సాధారణంగా చలికాలంలో టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టమాటా సీజన్‌గా చెబుతారు.
చలి పెరిగితే టమాటా దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ కాలంలో టమాటా ధర పడిపోతుంది. టమాటా ధరలు ఏడాదిలో బాగా పెరగడం, తగ్గడం జరుగుతుంది. కానీ సరఫరా ఎక్కువున్నా, తక్కువున్నా బాగుపడేది మాత్రం దళారులే. డిమాండ్ అధికంగా ఉండి ధర పెరిగితే.. ఆ మేరకు సొమ్ము రైతులకు చేరడం లేదు. గిట్టుబాటు ధరే లభిస్తుంది. అదే సీజన్‌లో టమాటా ధర తగ్గినప్పుడు రైతులకు ఏమీ మిగలడం లేదు. రైతులకు నామమాత్రంగా కిలోకు రూపాయో, అర్ధరూపాయో ఇస్తున్న దళారులు.. మార్కెట్లో మాత్రం నాలుగైదు రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నట్లు మార్కెటింగ్ వర్గాలే చెబుతున్నాయి.
ఏటా లక్ష టన్నులు వృథా..
రాష్ట్రంలో టమాటా, వంకాయ, బెండ, బీర, కాకర తదితర కూరగాయలు 8.68 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. మొత్తంగా ఏటా 50.01 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతుండగా.. తగిన నిల్వ వసతి లేక ఏటా 16.50 లక్షల టన్నులు కుళ్లిపోతున్నట్లు అంచనా. ఇలా కుళ్లిపోతున్న పంటలో దాదాపు లక్ష టన్నుల మేర టమాటాయే ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యా లను పండించాక వాటిని సరైన చోట, తగిన విధంగా నిల్వ ఉంచాలి.
మార్కెట్‌లో గిట్టుబాటు ధర రానప్పుడు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి.. డిమాండ్ పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. కానీ రాష్ట్రంలో సరిపడా శీతల గిడ్డంగులు అందుబాటులో లేవు. ఉద్యాన పంటల దిగుబడుల మేరకు రాష్ట్రంలో 216 శీతల గిడ్డంగులు అవసరంకాగా.. ఉన్నవి 56 మాత్రమే. టమాటా పూర్తిగా పండని స్థితిలో ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజీలో పెడితే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. పండినదైతే 20 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. కానీ శీతల గిడ్డంగులు సరిపడా లేక టమాటాలు కుళ్లిపోతున్నాయి.
వినియోగం పెంచాలి..
‘‘ఏయే సీజన్‌లో ఏ కూరగాయలు బాగా పండితే వాటి వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలి. టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగం పెంచాలి. కూరల్లో చింతపండుకు బదులు టమాటాను పులుపుగా వాడుకోవచ్చు. చలికాలంలో టమాటా సూప్ తయారు చేసుకోవచ్చు. అందరూ టమాటా కొనాలి.. తినాలి.. తాగాలి..’’ – ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి
ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం
టమాటా ధరలు స్థిరీకరించేందుకు నిల్వ వసతులను పెంచడంతోపాటు టమాటా ఉప ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పడం కూడా అవసరం. టమాటాతో జామ్ తయారు చేయవచ్చు, ఎండబెట్టి పొడిగా చేసి విక్రయించొచ్చు. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఆ రకమైన ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పాలి. వాటిని మహిళా సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తే వారికీ ఉపాధి దొరుకుతుంది. రైతులకు గిట్టుబాటు అవుతుంది.
♦ హాస్టళ్లలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం టమాటా సూప్ తయారు చేసి ఇవ్వొచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
♦ చలికాలంలో సూప్‌లు అందుబాటులోకి వస్తే టీ లాగా వినియోగదారులు సూప్‌లను తాగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల టమాటా పొడి, సూప్‌ల తయారీకి సంబంధించి చర్యలు చేపట్టాలి. ఇందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని, శిక్షణను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు అందజేయాలి.
♦ టమాటా రైతుల నుంచి ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉప ఉత్పత్తులు తయారు చేయించాలి.
Comments
Please login to add a commentAdd a comment