ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే! | Hot Topic Of Maruthirao Assets | Sakshi
Sakshi News home page

ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!

Published Wed, Mar 11 2020 7:18 AM | Last Updated on Wed, Mar 11 2020 12:21 PM

Hot Topic Of Maruthirao Assets  - Sakshi

అతనో సాధారణ కిరోసిన్‌ వ్యాపారిగా మిర్యాలగూడ పట్టణవాసులకు సుపరిచితుడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు బిల్డర్‌ అవతారమెత్తి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగెత్తాడు. పరువు హత్య అభియోగంతో అదే తరహాలో అథఃపాతాళానికీ పడిపోయాడు. చివరకు తన మరణశాసనాన్ని తానే లిఖించుకుని మరోమారు సంచలనంగా మారాడు.. అతనే తిరునగరు మారుతీరావు. ఆత్మహత్య ఉదంతం కూడా అతని ఆస్తుల చుట్టే తిరుగుతుండడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. 

సాక్షి, మిర్యాలగూడ : అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి... చివరికి ఆత్మహత్యతో ప్రస్తానం ముగిసింది. సంచలనం కలిగించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న తిరునగరు మారుతిరావు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. మారుతీరావు కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అల్లుడు ప్రణయ్‌ని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లుగా మారుతీరావు అభియోగాలు ఎదదుర్కొని ఎ1 నిందితుడిగా ఏడు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మారుతిరావు తన ఆస్తులను చక్కబెట్టుకునే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. చదవండి: డ్రైవర్‌ని ఆ షాప్‌ వద్ద కారు ఆపమన్న మారుతీరావు

అందరి దృష్టి ఆస్తులపైనే..
మారుతిరావు కూతురు అమృత మీడియాతో మాట్లాడిన సమయంలో బినామీలు ఉన్నారని, ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయని చెప్పడంతో అందరి దృష్టి  అతడి ఆస్తి విషయంపైకి మళ్లింది. 25 ఏళ్ల క్రితం సాధారణ కిరోసిన్‌ వ్యాపారిగా పాత స్కూటర్‌పై తిరిగిన మారుతిరావు అనతి కాలంలోనే కోట్లాదిపతిగా మారాడు. అటు బిల్డర్‌ అవతారం ఎత్తి అద్దంకి – నార్కట్‌పల్లి రహదారి వెంట ఉన్న శరణ్య గ్రీన్‌హోమ్స్‌లో సుమారు వంద నివాసాలు నిర్మించి విక్రయించాడు. దాంతో పాటు అక్కడే ఉన్న అపార్ట్‌మెంట్‌లు, ఈదులగూడలో రెండంతస్తుల షాపింగ్‌ మాల్స్‌ నిర్మించి విక్రయించినట్లు సమాచారం.

అదే విధంగా పట్టణ నడిబొడ్డున బస్టాండ్‌కు అతి సమీపంలో నటరాజ్‌ థియేటర్‌ స్థలంలో అతి పెద్ద మల్టీప్లెక్స్‌ నిర్మాణంలో ఉండగా అక్కడే ఆయన కార్యాలయం కూడా ఉండేది. దాంతో పాటు అద్దంకి – నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డులో చింతపల్లి రోడ్డు సమీపంలో ఒకటి, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో మరో ఖాళీ స్థలాలు ఉన్నట్లు సమాచారం. తాళ్లగడ్డ సమీపంలో ఒక వెంచర్, దామరచర్ల మండలంలో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా సుమారుగా రూ.200 కోట్లకుపైగా ఆస్తులు సంపాధించిన మారుతీరావు చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని ముగించాడు. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ'

బినామీలు సర్దుకున్నారా?
బిల్డర్‌గా, రియల్టర్‌గా కొనసాగిన మారుతీరావు తనతో పాటు కొంతమందిని బినామీలుగా వాడుకున్నట్లు సమాచారం. బినామీలుగా ఆయన వద్ద గతంలో పని చేసిన వారు, ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు వారి కుటుంబసభ్యుల పేరున కూడా భూములు కొనుగోలు చేసి వారికి రిజిస్ట్రేషన్లు కూడా చేయించినట్లు సమాచారం. వారి వద్ద నుంచి అవసరం వచ్చిన సమయంలో తిరిగి ఆయన పేరు మీదకి మార్చుకునే వారని తెలిసింది.

కాగా ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంత మంది బినామీలు భూములను విక్రయించుకోవడంతో పాటు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్తులను సర్దుకున్నట్లు సమాచారం. రూ.కోట్ల విలువల గల ఆస్తులను బినామీలు చక్కబెట్టుకోవడంతో ఆయన ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉండే వారని తెలిసింది. మారుతీరావు ఆస్తుల విషయంపై పోలీసులు విచారణ చేస్తే బినామీలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. 

వివాదాలు ఉన్నట్లు ప్రచారం? 
ఆస్తుల విషయంలో కటుంబ సభ్యులకు వివాదాలు ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. రూ.వందల కోట్ల   ఆస్తులు ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఏ కోణంలో చేసుకున్నాడనే విషయంపై పోలీసులు విచారించనున్నారు. ఆయన ఆస్తుల విషయంపై వివాదాలు ఉన్నాయని, ఇటీవలనే పంపకాలు కూడా చేసుకున్నట్లు తెలిసిందని అమృత మీడియా ముందు చెప్పడంతో మరింత చర్చ జరుగుతోంది. మారుతీరావు అప్పులుంటే వడ్డీతో సహా తీర్చుతానని, రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోతే చేస్తానని శ్రవణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు తన ఆస్తుల వీలునామా కూడా రాసినట్లుగా పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. చదవండి: కూతురు రాదనే... మనస్తాపంతోనే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement