సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో ప్రవేశాల్లో జాప్యం తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో న్యాయ విద్య ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయినందున ఈనెలలో ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్లను పూర్తి చేయాలన్న ఆలోచనకు కమిటీ సభ్యులు వచ్చారు.
ఇందులో భాగంగా తాత్కాలిక షెడ్యూలును ఖరారు చేశారు. ఈనెల 13వ తేదీన ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీచేసి, 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. 21వ తేదీనుంచి 25వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 28వ తేదీన సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. అయితే సీట్లను కేటాయించే 28వ తేదీ వరకు బీసీఐనుంచి కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. అవి వస్తేనే సీట్లను కేటాయించనున్నారు.
నాలుగు నెలలుగా ఎదురుచూపులే..
న్యాయ విద్యలో ప్రవేశాలకోసం లాసెట్‌ను గత మే 27న నిర్వహించారు. ఈ పరీక్షకు 40 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితాలను జూన్ 10వ తేదీన విడుదల చేశారు. అందులో 18,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారికి అప్పటినుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో బీసీఐ జాప్యం చేస్తూనే ఉంది.
గత ఏడాది ఎల్‌ఎల్‌ఎంలో 524 సీట్లు, మూడేళ్ల లా కోర్సులో 2,590 సీట్లు, 5 ఏళ్ల లా కోర్సులో 1,176 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికే కాకుండా మరిన్ని కొత్త కాలేజీలకు సైతం అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అయితే అనుమతులపై మాత్రం బీసీఐ ఇంతవరకూ తేల్చలేదు.
Published Thu, Oct 5 2017 2:14 AM | Last Updated on Thu, Oct 5 2017 2:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment