న్యూఢిల్లీ: న్యాయ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(క్లాట్) ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా 19 ప్రతిష్టాత్మక జాతీయ న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి ఈ పరీక్షను మే 13న నిర్వహించారు. ఫలితాలను నేడు ప్రకటించడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతున్న సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల విలువైన సమయం కోల్పోయామని, ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
విద్యార్థుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని జూన్ 6న నివేదిక సమర్పించాలని పరీక్ష నిర్వహించిన కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్(ఎన్‌యూఏఎల్‌ఎస్) ఫిర్యాదుల పరిష్కార కమిటీని కోర్టు ఆదేశించింది. కేరళ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎంఆర్ హరిహరన్ నాయర్, కొచ్చి యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా.సంతోష్ కుమార్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యల వల్ల అభ్యర్థులు విలువైన సమయం కోల్పోయారని విద్యార్థుల తరఫున హాజరైన సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, జొహొబ్ హొస్సేన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఫలితాలను నిలిపివేయడం పరిష్కారం కాదని ఎన్‌యూఏఎల్‌ఎస్ తరఫు లాయర్ వి.గిరి వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment