
జీతాల్లేకుండా ఎట్లా బతకాలి?
‘ఆస్పత్రి శుభ్రంగా లేకపోతే దూషిస్తారు. కానీ ఆరు నెలలుగా మాకు జీతాలు రాకుంటే ఎవరికీ పట్టింపు లేదు. కాంట్రాక్టర్‌ను అడిగితే పైనుంచి రావడం లేదంటారు.
తాండూరు: ‘ఆస్పత్రి శుభ్రంగా లేకపోతే దూషిస్తారు. కానీ ఆరు నెలలుగా మాకు జీతాలు రాకుంటే ఎవరికీ పట్టింపు లేదు. కాంట్రాక్టర్‌ను అడిగితే పైనుంచి రావడం లేదంటారు. ఆస్పత్రి అధికారులకు మొరపెట్టుకుంటే ఫలితం లేదు. నెలలుగా జీతాలు రాకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. పూట గడటమే కష్టంగా మారింది.
రెండు రోజుల్లోపు మా జీతాలు మొత్తం చెల్లించకపోతే ఆస్పత్రి ఎదుటే మందు తాగి సచ్చిపోతాం’ అంటూ తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కాంట్రాక్ట్ పారిశద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ హనుమంతరావు వచ్చారన్న విషయం తెలుసుకున్న కార్మికులు ఆయన వద్దకు వచ్చి తమ బాధలను వివరించారు. రూ.3,500 అరకొర జీతంలో నెలలుగా జాప్యం జరిగితే ఏం తిని బతకాలి సార్ అంటూ నిలదీశారు. ‘ఇచ్చే జీతంలో పీఎఫ్ పేరుతో రూ.500 కోత విధిస్తారు. కానీ నాలుగేళ్లుగా మా పీఎఫ్ డబ్బులు ఎక్కడున్నాయో తెలియదు.
దసరా పండుగ వస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పండగను ఎలా జరుపుకోవాలి’ అంటూ మహిళా కార్మికులు ధ్వజ మెత్తారు. ఈ విషయం తెలుసుకున్న ము న్సిపల్ కౌన్సిలర్ లింగదళ్లి రవికుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సమన్వయకర్త హనుమంతరావు,సూపరింటెండెంట్ వెంకటరమణప్పలతో మా ట్లాడారు. ఇన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. రెండు రోజుల్లోపు రెండు నెలల జీతాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీనికి కార్మికులు అంగీకరించలేదు. రెండు నెలల జీతాలు తమకు అవసరం లేదని, మొత్తం కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సంబంధిత ఏజెన్సీ, కాంట్రాక్టర్‌తో మాట్లాడి జీతాలు, పీఎఫ్ డబ్బుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సమన్వయకర్త సమాధానం ఇచ్చారు. సోమవారానికల్లా జీతాల సమస్య పరిష్కరించాలని కార్మికులు స్పష్టం చేసి వెళ్లిపోయారు.