సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లో కరోనా వైరస్ రోజు రోజుకు మరింత విస్తరిస్తుంది. సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు కోర్‌సిటీకే పరిమితమైన కేసులు...తాజాగా శివారులోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 27న అత్యధికంగా 888 కేసులు నమోదు కాగా..తాజాగా సోమవారం మరో 861 పాజిటివ్ కేసులు నమోదు కాగా....మరో ఆరుగురు మృతి చెందారు. ఇదిలా ఉండగా రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ అలీ సహా ఆయన గన్‌మెన్లు నలుగురు కరోనా వైరస్ బారిన పడటం విశేషం. ప్రస్తుతం ఆయన జూబ్లిహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంత రావు కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం గమనార్హం.(నేటి నుంచి కరోనా పరీక్షలు)
నారాయణగూడ పీఎస్‌లో ఐదుగురికి..
హిమాయత్‌నగర్ : నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో ఒక్కసారిగా ‘కరోనా’ కలకలం రేగింది. సోమవారం ఓ మహిళా ఎస్సై, మరో మగ్గురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే హోంగార్డుకు కూడా పాజిటివ్ రావడంతో తోటి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
ఫీవర్‌లో 54 కోవిడ్ అనుమానిత కేసులు
నల్లకుంట : నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం 54 కోవిడ్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. అనుమానితులకు ఆసుపత్రి ఆవరణలోని కరోనా హెల్ప్ డెస్క్ వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వారి నుంచి నమూనాలు సేకరించి కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.
27 మందికి పాజిటివ్..
ఆదివారం అనుమానితుల నుంచి సేకరించిన నమూనాల ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా 27 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ, నిమ్స్, చెస్ట్ ఆసుపత్రులకు పంపించారు.
కింగ్‌కోఠిలో 75 పాజిటివ్ కేసులు
సుల్తాన్‌బజార్ : కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో సోమవారం 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మల్లిఖార్జున్ తెలిపారు. కరోనా లక్షణాలతో 295 మంది ఔట్ పేషెంట్లుగా ఆస్పత్రికి రాగా 200 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఏడుగురిని అడ్మిట్ చేసుకున్నారు. గతంలో కరోనా టెస్టులు చేసిన వారిలో 26 మందికి నెగెటివ్ రావడంతో 16 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 121 మంది చికిత్సలు పొందుతున్నారు. 138 మంది రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
కరోనాతో ఏఎస్‌ఐ మృత్యువాత
అమీర్‌పేట : ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న మొహ్మద్ సమీరుద్ధీన్ (57) కరోనాతో మృతి చెందాడు. గోల్కొండ టోలిచౌకి మోతీదర్వాజలో ఉంటూ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే సమీర్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 19న వైద్య పరీక్షలు నిర్వహించారు. 20న పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అదే రోజు కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమీర్ ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఛాతీ ఆసుపత్రిలో మరొకరు..
వెంగళరావునగర్ : కరోనా వ్యాధితో బాధపడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వెంగళరావునగర్ డివిజన్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ నియోజకవర్గం, శ్రీరామ్‌నగర్ బస్తీకి చెందిన వ్యక్తి (35) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 26న అతడిని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కాగా సయ్యద్‌కు ఆసుపత్రిలో సరైన చికిత్స అందించనందునే మృత్యువాతపడ్డాడని ఆరోపిస్తూ అతడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అధికారులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. కాగా సయ్యద్ అహ్మద్ కరోనాతో మృతిచెందాడని, ఆసుపత్రిలో అతడికి మెరుగైన చికిత్స అందించామని సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో 402 యాక్టివ్ కేసులు
మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు అర్బన్ ప్రాంతంలోనే నమోదుకాగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగికి పాజిటివ్ కేసు నమోదు కావటంతో అధికార, ఉద్యోగ వర్గాల్లో కలవరం మొదలైంది. జిల్లాలో 700కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిరకు 33 మంది కరోనాతో మృతి చెందారు. మేడ్చల్ నియోజకవర్గంలో 110 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మృత్యువాతపడ్డారు.
ఉప్పల్ నియోజకరవ్గంలో కరోనా పాజిటివ్ 185 కాగా, యాక్టివ్ కేసులు 103 ఉన్నాయి. ఏడుగురు మృతి చెందారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో 211 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 143 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 15 మంది మృతి చెందారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో 194 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 91 యాక్టివ్‌గా ఉండగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్య అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజులుగా రూరల్ ప్రాంతంలో కూడా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నిత్యావసర సరుకులు , మందులను అంగన్వాడీ, మెడికల్, ఆశవర్కర్లు, వాలంటీర్ల సహకారంతో ఇళ్లవద్దకే పంపిణీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment