మూడో వాడెవడు?
‘సూర్యాపేట’ నుంచి పరారైన మూడో ముష్కరుని కోసం వేట
పారిపోతుండగా బంధించిన సీసీ టీవీ కెమెరాలు
పుటేజీల్లో కనిపించిన ‘పెద్ద బ్యాగు’ సైతం మాయం
సూర్యాపేట, అర్వపల్లి, జానకీపురంలో మూడో రోజూ కూంబింగ్
పోలీసులకు చిక్కిన హతమైన ఉగ్రవాదుల సెల్‌ఫోన్
కాల్ డేటా విశ్లేషిస్తున్న కౌంటర్ ఇంటెలిజెన్స్, ఐబీ
హైదరాబాద్: ‘సిమి’ ఉగ్రమూకకు సంబంధించి కీలక ఆధారాలు పోలీసులకు చిక్కాయి. సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసులపై సిమి ఉగ్రవాదులు ఎజాజుద్దీన్, అస్లం దాడి జరిపిన సమయంలో మరో వ్యక్తి ఘటన స్థలం నుంచి పారిపోతూ బస్టాండ్‌లో అమర్చిన సీసీ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఆ ఫుటేజీలను విశ్లేషించిన నిఘా వర్గాలు, అతను కూడా ఉగ్రవాదే అయ్యుంటాడని అనుమానిస్తున్నాయి. ఇదే నిజమైతే ఆ మూడో ఉగ్రవాది సైతం నల్లగొండ జిల్లాలోనే ఎక్కడో ఓ చోట షెల్టర్ పొంది ఉంటాడని భావిస్తున్నాయి. సూర్యాపేట బస్టాండ్‌లోని సీసీ టీవీ ఫుటేజీల్లో ఉగ్రవాదుల వద్ద కనిపించిన ఓ బ్యాగు సైతం గల్లంతైంది. వాస్తవానికి నిందితుల వద్ద రెండు బ్యాగులుంటే ఘటన సమయంలో పోలీసులకు చిన్న సైజు బ్యాగు మాత్రమే దొరికింది. అందులో కేవలం దుస్తులే ఉన్నాయి. దొరకని పెద్ద బ్యాగులో ఏముండి ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయంగా మారింది.
ఆ మూడో వ్యక్తి, గల్లంతైన బ్యాగు కోసం సోమవారం మూడో రోజూ నల్లగొండ పోలీసులు అన్వేషణ కొనసాగించారు. గ్రేహౌండ్స్ దళాలతో కలిసి జిల్లాలోని అర్వపల్లి, జానకీపురం, సూర్యాపేట తదితర ప్రాంతాలను జల్లెడపట్టారు. కానీ, ఆరు బృందాలతో అణువణువు శోధించినా ఎలాంటి ఆధారమూ దొరకలేదని సమాచారం. బ్యాగు దొరికితే దాని ఆధారంగా సిమి ఉగ్రవాదుల కుట్రలు, కదలికలు, కుట్రల సమాచారం తెలుస్తుందని నిఘా వర్గాలు ఆశిస్తున్నాయి. జానకీపురం ఎన్‌కౌంటర్‌లో హతమైన ఎజాజుద్దీన్, అస్లం వద్ద పోలీసులకు ఓ సెల్ సైతం లభ్యమైంది. పోలీసు ఉన్నతాధికారులు కొట్టిపారేస్తున్నా, సెల్‌ఫోన్ దొరకడం నిజమేనని కొందరు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ సెల్ కాల్‌డేటాను ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు విశ్లేషిస్తున్నాయి. సిమి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సూర్యాపేట బస్టాండ్ ఘటన, జానకీపురం ఎన్‌కౌంటర్ మధ్య కాలంలో దుండగులు సాయం కోసం పలువురికి ఫోన్ చేసినట్లు సమాచారం. అబూ ముఠాలో పలు రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మిగతా ముగ్గురు ఉగ్రవాదులు మహబూబ్, అంజద్, జాకీర్ హుస్సేన్‌ల కదలికలను పసిగట్టేందుకు ముష్కరులు వాడిన సెల్‌ఫోన్ కీలకం కానుంది. మధ్యప్రదేశ్, తమిళనాడు, ముంబై, పశ్చిమబెంగాల్ ఏటీఎస్ బృందాలు ఇప్పటికే మన కౌంటర్ ఇంటలిజెన్స్ నుంచి ఈ సెల్‌ఫోన్ కాల్‌డేటాను సేకరించినట్లు చెబుతున్నారు. దీంతో త్వరలో మరికొందరు ముష్కరులు చిక్కవచ్చంటున్నారు.