మాస్కో : ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనడానికి ఆయా దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా ఆయా సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు దర్యాప్తు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతోంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సరైన ఫలితాలు రావడం లేదని మాస్కో కొత్త ప్రయోగానికి నాంది పలికింది.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు దర్యాప్తు బృందాలు తీవ్రవాదులను, క్రిమినల్స్ ను గుర్తించడానికి పోలీసులు సాధారణంగా సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తుంటారు. సీసీ ఫుటేజీల సమాచారంలో అనేక సందర్భాల్లో క్రిమినల్స్ ను గుర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే జన బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట కూడళ్లలో సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు, లేదా తీవ్రవాదులు ప్రధానంగా ఎయిర్ పోర్టుల నుంచి వెలుపలికి వస్తున్న సందర్భాలను విశ్లేషించాల్సిన సమయాల్లో సీసీ ఫుటేజీతో అంత స్పష్టత రావడం లేదని మాస్కో ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
ఇప్పుడు సీసీ కెమెరాల్లో ప్రధానంగా మునుషుల ముఖాలను సులభంగా (ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ) గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అనుమానిత వ్యక్తి ముఖాన్ని ఇట్టే తెలిపే ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సీసీ కెమెరాలను ఇప్పుడు మాస్కో విరివిగా ఏర్పాటు చేయడం ప్రారంభించింది. మాస్కో నగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,70,000 వేల ఇలాంటి సర్వెలెన్స్ కెమెరాలను అమర్చాలని నిర్ణయించింది. మాస్కో సెక్యూరిటీ నెట్ వర్క్ 2012 నుంచి మిలియన్ల కొద్ది వీడియో పుటేజీలను కలిగి ఉంది. అయితే ఈ ఫుటేజీతో క్రిమినల్స్ ను గుర్తించడం సాధ్యమయ్యేపని కాదని కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ సెక్యూరిటీ కెమెరాలను వినియోగించడం ప్రారంభించిందని, దీనివల్ల ఆయా నేరాల దర్యాప్తులో ఎంతో పురోగతి ఉంటుందని 'జిన్హువా' కథనం.
తీవ్రవాదంపై పోరులో భాగంగా ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల రష్యా ఇప్పటికే అనేక చిక్కుముడులను విప్పిందని, ఈ ఏడాది మొదటి అర్థభాగంలో తీవ్రవాదులు దాడులకు ప్రయత్నించిన దాదాపు 12 సందర్భాలను ముందస్తుగా గుర్తించి నిరోధించగలిగిందని రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం పేర్కొంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని రష్యాకు ఎన్ టెక్ లాబ్ అనే స్టార్టప్ కంపెనీ సమకూర్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తుల ముఖాలను కచ్చితంగా గుర్తించగలుగుతున్నాయని యూఎస్ కామర్స్ డిపార్ట్ మెంట్, యునివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లు సర్టిఫై కూడా చేసినట్టు రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ నివేదిక పేర్కొంది.
ఇలా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన సెక్యూరిటీ కెమెరాలను ప్రయోగాత్మకంగా అమర్చిన రెండు నెలల్లోనే టెర్రరిస్టుల వాంటెడ్ జాబితాలో ఉన్న ఆరుగురు తీవ్రవాదులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. అయితే, ఈ టెక్నాలజీ సెక్యూరిటీ కెమెరాల ఖర్చు ఎక్కువగా ఉన్నందున కేవలం అతిముఖ్యమైన ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అమర్చుతున్నారు.