నిఘా పెంచండి
నగరంలో సీసీ కెమెరాలు
మరిన్ని ఏర్పాటు చేయూలి
కేంద్ర మంత్రి అనంతకుమార్ ఆదేశం
బెంగళూరు : బెంగళూరు నగరంలో ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజా రక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు. బొమ్మనహళ్లి పరిధిలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ వార్డులో స్వచ్ఛభారత్, బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సతీష్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రితో చర్చించామన్నారు. ఇందులో భాగంగా తన శాఖ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రతిఒక్కరూ స్వచ్ఛభారత్‌లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
బొమ్మనహళ్లి బీజేపీ అధ్యక్షుడు మాలా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ స్వభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానికులతో సభ్యత్వం నమోదు చేయించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ బొమ్మనహళ్ళి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి బొమ్మనహళ్ళి నియోజకవర్గం పరిధిలోని వివిధ వార్డుల్లో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ సభ్యుడు సయ్యద్ అన్వర్, బీజేపీ నాయకుడు సయ్యద్ సలాం, బీజేపీ యువమొర్చా అధ్యక్షుడు రమేష్, కార్మిక విభాగం అధ్యక్షుడు నాగేంద్ర, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతకుముందు స్థానికులు చేపట్టిన స్వచ్చభారత్ కాార్యక్రమంలో అనంతకుమార్ పాల్గొని వీధుల్లో గోడలకు రంగులు వేశారు.