మిలాఖత్
లడ్డూ దందాలో ఇంటిదొంగలే కీలకం
దళారులతో చేతులు కలిపిన నిఘా, కౌంటర్ సిబ్బంది, ట్రేలిఫ్టర్స్
సీసీ కెమెరాల పనితీరుపైనా అనుమానాలు
తిరుమల : కొండ లడ్డూ అక్రమదందాలో కంచే చేనుమేస్తోందా.. నిఘా సిబ్బందే దళారులతో చేతులు కలిపారా..? కౌంటర్ సిబ్బంది.. ట్రే లిఫ్టర్స్ చేతుల మీదుగానే లడ్డూలు పక్కదారి పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. చీమచిటుక్కుమన్నా పసిగట్టి గుట్టువిప్పాల్సిన సీసీ కెమెరాలూ ఈ అక్రమ దందాను చిత్రీకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిఘా సిబ్బందే బేరసారాలు
దళారులతో నిఘా సిబ్బంది మిలాఖతై భక్తులతో బేరసారాలు సాగిస్తున్నారు. కొందరు దళారుల్ని అసిస్టెంట్లుగా నియమించుకుని ఈ అక్రమ వ్యాపారంలో తలమునకలైపోయారు. కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తుడికి ఇచ్చే ఒక ఉచిత లడ్డూ టోకెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తుల్లో ఒకరికి ఇచ్చే రూ.10 చొప్పున రెండు సబ్సిడీ టోకెన్లతోనే ఈ అక్రమ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
అచ్చం సినిమాల్లో మాదిరిగానే
సినిమాల్లో డాన్‌ను కలిసే తరహాలోనే తిరుమలకొండ మీద లడ్డూల అక్రమ వ్యాపారం సాగుతోంది. దళారులు పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఓ దళారి భక్తుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మరో దళారి కౌంటర్ నుంచి లడ్డూలు తీసుకొస్తాడు. ఇంకోదళారి ఆ భక్తుడికి లడ్డూలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. వీరికి టీటీడీ నిఘా సిబ్బంది, కౌంటర్ సూపర్‌వైజర్, ట్రే లిఫ్టర్లు వారివారి స్థాయిలో సహకారం అందిస్తారు. చివరగా వచ్చిన ఆ డబ్బులు అందరూ పంచుకుంటారు.
మూడో కంటికి తెలియకుండా..
లడ్డూ కౌంటర్ల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి సాక్షిగానే లడ్డూల అక్రమ విక్రయాలు సాగుతున్నాయి. ఈ దృశ్యాలు వాటికి కనిపించటం లేదు. దళారుల కదిలికల్ని పసిగట్టడంలేదు. సీసీ కెమెరా అపరేట్‌చేసే సిబ్బందీ వీటిని రికార్డు చేయడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అక్రమ దందాలో పాత్రదారులెందరో?
భక్తులకు కాలిబాట టోకెన్లు, సబ్సిడీ లడ్డూ టోకెన్లు ఇచ్చే బాధ్యతల్ని ఓ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఈ సంస్థలో పనిచేసే కొందరు సిబ్బంది ఈ అక్రమ దందాలో ప్రధాన పాత్రధారులు. టోకెన్లను దొడ్డిదారిలో తరలిస్తూ లక్షలాది రూపాయలు టీటీడీకి నష్టం కలిగిస్తున్నారు. వీరితో కొందరు విజిలెన్స్, టీటీడీ సిబ్బంది కలసిపోయి అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కుల చిట్టా కొందరు విజిలెన్స్ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.