వందలమంది ఉగ్రవాదులను పంపిస్తున్నారా?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని ఊడి సెక్టార్ పై దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు మూడు రోజులు ముందుగానే హెచ్చరించాయట. గత ఆగస్టు 28 నుంచే ఉగ్రవాదులు ఊడి స్థావరంపై దాడులు ఎలా చేయాలనే అంశాన్ని ఆచరణలో పెట్టాయని, ప్రతి రోజు ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతాన్ని వారు దూరం నుంచి వీక్షించి అనుకున్న ప్రకారం దాడి చేశారని ఢిల్లీకి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది.
ఎనిమిదిమంది పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్థాన్ భారత్ మధ్య వాస్తవాదీన రేఖ వద్ద ఎప్పుడు ఊడిపై దాడి చేద్దామా అని ఎదురుచూస్తున్నారని సరిహద్దులోని బలగాలకు సెప్టెంబర్ 15న సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎనిమిదిమంది ఉగ్రవాదులు ఇతర ఉగ్రవాదులు ఊడిలోని ఓ కొండప్రాంతంలో దాచుకొని ఆగస్టు 28 నుంచి రహస్యంగా ఊడి స్థావరాన్ని పరిశీలించారని, దీనిని గుర్తించి తాము సమాచారం అందించినట్లు తెలిపారు.
అయితే, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నిర్లక్ష్యం చేయడంతోపాటు ఆ సమయంలో జమ్ముకశ్మీర్ లో విధించిన హైఅలర్ట్ పైనే ఎక్కువగా సైన్యం దృష్టిసారించడం కూడా ఉగ్రవాదులు చొచ్చుకురావడానికి ఇందుకు మరో కారణంగా నిలిచిందట. మరోపక్క, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల తర్వాత వందల సంఖ్యలో ఉగ్రవాదులను సరిహద్దు దాటించి భారత్ లోకి పంపించే కుట్రలు కూడా పాక్ చేస్తోందని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయట. భద్రతా లోపం వల్లే ఉగ్రవాదులు చొచ్చుకొచ్చారన్నట్లుగా ఇప్పటికే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా చెప్పిన విషయం తెలిసిందే.