
హైదరాబాదే ఎందుకంటే..
హైదరాబాద్‌కు వలసల తాకిడి పెరిగేందుకు భిన్నసంస్కృతుల మేళవింపే ప్రధాన కారణం. దక్కన్ పీఠభూమి కావడంతో చల్లని వాతావరణం, ప్రకృతి విపత్తుల తాకిడి చాలా తక్కువ. నేరాలు రేటు అంతంతే. ఆధునిక జీవన శైలి.. ఐటీ హబ్, బహుళ జాతి సంస్థలకు చిరునామాతో భాగ్యనగరం ఇతర ప్రాంతాలప్రజలను ఇట్టే ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు సాప్‌్టవేర్ నిపుణులు, మానవవనరులు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో అంకుర పరిశ్రమల రాకకు దోహదపడుతున్నాయి. ఇవేగాకుండా లైఫ్‌స్టైల్ తగ్గట్టుగా వినోద, రవాణా సౌకర్యాలు కలిగిఉండటం కూడా హైదరాబాద్‌కు ప్లస్‌పాయింట్‌గా మారింది.
విశాఖకు కూడా..
మహానగరాలతో విశాఖపట్నం కూడా పోటీ పడుతోంది. సుదూర సముద్రతీరం.. నౌక వాణిజ్యం, పర్యాటక రంగానికి వైజాగ్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న రియల్‌రంగం.. సినీ స్టూడియోల నిర్మాణంతో నగరం బ్రాండ్ విలువ క్రమంగా పెరిగేందుకు కారణమవుతుంది. అరకు వ్యాలీ, సింహాచలం, రుషికొండ, రామకృష్ణ, భీమిలీ బీచ్‌లతో విశాఖ అందాలు, పర్యాటక, హోటల్ రంగాల్లో కొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత ఐటీ రంగానికి అనువైన ప్రాంతంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలు భావిస్తుండటం కూడా స్టార్టప్ కంపెనీల రాకకు ఊతమిస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్ : వాతావరణం, భిన్న సంస్కృతులు, భాషలు, తక్కువ క్రైం రేట్, క్రమంగా ఊపందుకుంటున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజ లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హైదరాబాద్, విశాఖపట్నం వైపు చూసేలా చేస్తున్నా యి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిన భాగ్యనగరంతో పాటు విశాఖపట్నం జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఓ ఆర్థిక సంస్థ నిర్వహించిన సర్వేలో నివాసానికి, వ్యాపారానికి అనువైన నగరాల్లో ఈ రెండూ ఉన్నాయని తేల్చింది.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వైపు చూపు..
మహా నగరాల్లో నివసించడం అంటే ఒకప్పుడు అందరికీ క్రేజ్. అదే ఇప్పుడు ఆ నగరాల నుంచి ఎప్పుడు బయటపడుదామనే చూపులు. దీనికి ప్రధాన కారణం మెట్రో నగరాల్లో పెరిగిన జీవన వ్యయం, కాలుష్యం, ఆరోగ్య సమస్యలే. దీంతో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణేల నుంచి ఇప్పుడిప్పుడే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన ఇండోర్, కొచ్చి, సూరత్, భువనేశ్వర్, నాసిక్, విశాఖపట్నం వంటి నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు. నివాసానికేగాకుండా.. అంకుర పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపారాలకు ఈ నగరాలు కూడా అనువైనవిగా భావిస్తుండటమే దీనికి కారణం.
మరీ ముఖ్యంగా జీవనవ్యయం కూడా చాలా తక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఇక్కడికి రెక్కలు కట్టుకుని వాలేందుకు రెడీ అవుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ నగరాలను ఎంచుకోవడం వల్ల సంపాదించిన దాంట్లో కాస్తో కూస్తో వెనకేసుకోవచ్చనే ఆలోచన కూడా వలసల తాకిడి పెరిగేందుకు కారణమవుతోంది. మరో ముఖ్యమైన విషయమేమంటే.. బడా నగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం కష్టంగా మారిన క్రమంలో రెండో కేటగిరీ నగరాలకు మళ్లేందుకు దారితీస్తోంది. కేవలం సొంతిల్లే కాదు.. అత్యంత అందుబాటులో అద్దె ఇళ్ల ధరలు ఉండటం కూడా ఈ పట్టణాలవైపు చూసేలా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment