మణిహారానికి మెరుగులు | Hyderabad Charminar Restoration: Four Minars Repair Completed | Sakshi
Sakshi News home page

మణిహారానికి మెరుగులు

Published Tue, Nov 5 2019 12:26 PM | Last Updated on Sat, Nov 9 2019 1:13 PM

Hyderabad Charminar Restoration: Four Minars Repair Completed - Sakshi

అదో అపురూపమై కట్టడం. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం.

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరానికే మణిమకుటం. తెలంగాణకే తలమానికం. అదో అపురూపమై కట్టడం. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. అదే చార్మినార్‌. హైదరాబాద్‌ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఈ అరుదైన నిర్మాణమే. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది చార్మినార్‌ ప్రాంతం. కాలుష్యం బారిన పడి వన్నె తగ్గడంతో చార్మినార్‌కు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) మరమ్మతులు చేపట్టింది. మసకబారిన మినార్‌లతో పాటు అక్కడక్కడ పెచ్చులూడి, పగుళ్లు ఏర్పడటంతో 2016లో మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. గత అక్టోబర్‌ దాకా ఈ పనులు కొనసాగాయి. మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. రూ.3 కోట్లు మంజూరు కావాల్సి ఉందని.. అవి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు మినార్‌లకు మరమ్మతు పనులతో పాటు రంగులు వేశారు. వచ్చే ఏడాది మార్చి నెల వరకు పనులు పూర్తి కానున్నాయి.           

క్రీ.శ.1591–92లో కుతుబ్‌షాహీ వంశంలోని ఐదో పాలకుడు, హైదరాబాద్‌ నగర వ్యవస్థాపకుడు మహ్మద్‌ కులీ కుతుబ్‌షా నిర్మించిన చార్మినార్‌ కట్టడం గత కొన్నేళ్లుగా కాలుష్యం కారణంగా పూర్తిగా మసకబారడంతో పురావస్తు శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. 2016–17లో ఉత్తరం– పశ్చిమం వైపు పనులు జరిగాయి. 2017–18లో దక్షిణం–పశ్చిమం వైపు, 2018–19లో ఉత్తరం–తూర్పు వైపు, దక్షిణం– తూర్పు వైపు ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. రంగులు వేయాల్సి ఉంది. వచ్చే మార్చి వరకు చార్మినార్‌ కట్టడం బయటి గోడలకు రిపేర్‌ పూర్తి అవుతుంది. లోపలి గోడలకు మరమ్మతులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

విశిష్టత ఇదీ..   
కుతుబ్‌షాహీల కాలంలోని కళానైపుణ్యానికి అద్దం పట్టేలా చార్మినార్‌ కట్టడం చరిత్ర పుటల్లో నిలుస్తోంది. చార్మినార్‌ను తిలకించడానికి పర్యాటకులు సైతం ఉత్సాహం చూపుతున్నారు. చార్మినార్‌ ఒక్కో మినార్‌ నేల నుంచి 56 మీటర్లు ఉండగా.. రెండో అంతస్తు నుంచి 34 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ మినార్‌లలో కూడా మళ్లీ మూడంతస్తులున్నాయి. ప్రతి మినార్‌లో కింది నుంచి పైకి వెళ్లడానికి సర్పాకారంలో 149 మెట్లున్నాయి.  

విరిగిపడుతున్న డిజైన్‌ దిమ్మెలు..
చారిత్రక చార్మినార్‌ కట్టడంలోని మక్కా మసీదు వైపు ఉన్న మినార్‌పై ఉన్న పూల డిజైన్‌ ఈ ఏడాది మే 1న రాత్రి 11.40 గంటలకు భారీ శబ్దంతో ఊడి పడింది. 2002, 2010లలోనూ చార్మినార్‌ కట్టడం పైఅంతస్తులోని బయటి వైపు ఉన్న పూల డిజైన్‌ల గచ్చులు ఊడి కింద పడ్డాయి. వెంటనే స్పందించిన పురావస్తు శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అప్పట్లో డంగు సున్నంతో ఏర్పాటు చేసిన డిజైన్‌ పూల గచ్చు దిమ్మెలకు చార్మినార్‌ కట్టడంలోని రాళ్లతో అనుసంధానం (బాండింగ్‌) లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని నిఫుణులు స్పష్టం చేస్తున్నారు.

రాళ్లతో కట్టిన చార్మినార్‌ నలువైపులా గోడలు, మినార్‌లకు డంగు సున్నంతో డిజైన్‌లను ఏర్పాటు చేయడంతో పటుత్వం లేకుండాపోతోంది. ప్రస్తుతం జరిగే భారీ కట్టడాలకు స్టీల్, ఐరన్‌ల సపోర్టు ఇస్తూ నిర్మిస్తుండడంతో పటుత్వం కోల్పోకుండా ఏళ్ల తరబడి ఉంటున్నాయి. సున్నంతో నిర్మించినందున అప్పుడప్పుడు యాసిడ్‌తో కూడిన వర్షాలు పడుతుండడంతో రెండింటికి కెమికల్‌ రియాక్షన్‌ జరిగి రాతి కట్టడానికి డంగు సున్నానికి నడుమ గ్యాప్‌ ఏర్పడుతోంది. ఇలా ఏర్పడిన గ్యాప్‌లో నీరు చేరుతుండడంతో బరువు ఎక్కువై సున్నం పటుత్వాన్ని కోల్పోయి కింద పడుతోంది.  

జీహెచ్‌ఎంసీ స్థలం ఇస్తే..
జీహెచ్‌ఎంసీ అధీనంలోని ఖాళీ స్థలాన్ని తమకు కేటాయిస్తే చార్మినార్‌ కట్టడాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకులకు పలు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పురావస్తు శాఖ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌  డాక్టర్‌ మిలన్‌ కుమార్‌ చావ్లే జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. సాధ్యమైనంత వెంటనే తమకు ఖాళీ స్థలాన్ని కేటాయిస్తే.. పర్యాటకుల సౌకర్యార్ధం టాయిలెట్లు, క్లాక్‌ రూంలు, టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రస్తుతం చార్మినార్‌ కట్టడం ప్రాంగణంలో కొనసాగుతున్న టికెట్‌ కౌంటర్‌ను బయట ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ వెంటనే స్పందించి స్థలాన్ని కేటాయిస్తే.. పర్యాటకులకు మరిన్ని వసతుల కల్పనకు ఏఎస్‌ఐ సంసిద్ధత వ్యక్తంచేస్తోంది.

పనులు చకచకా..
చార్మినార్‌ కట్టడానికి 2016 నుంచి మరమ్మతు పనులు చకచకా జరుగుతున్నాయి. డంగు సున్నంతో పనులు చేస్తుండటంతో అది ఆరడం కోసం సమయం పడుతోంది. గత నెల వరకు పనులు జరిగాయి. ప్రస్తుతం మిగిలిన పనుల కోసం రూ.3 కోట్ల నిధులు అవసరం. ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశాం. అప్పుడప్పుడు పూల డిజైన్‌ల పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. వాటన్నింటికి తిరిగి మరమ్మతులు చేపట్టాం. పటుత్వం కోసం అవసరమైన చోట స్టీల్‌ రాడ్‌లతో సపోర్ట్‌ ఏర్పాటు చేసి మరమ్మతులు చేశాం. బయట పనులు పూర్తయితే.. వచ్చే ఏడాది లోపల పనులు ప్రారంభిస్తాం. జీహెచ్‌ఎంసీ ఖాళీ స్థలం కేటాయిస్తే.. పర్యాటకుల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి చేస్తాం.
– మిలన్‌ కుమార్‌ చావ్లే, ఏఎస్‌ఐ, హైదరాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement