
కొనసాగుతున్న డ్రగ్స్ కలకలం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో పోలీసులు చురుగ్గా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పియూష్ అనే సివిల్ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందిడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.
ఎల్‌ఎస్‌డీ కేసులో 11 మందిని, కొకైన్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వారికి సెక్షన్ 67 కింద నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. ఈ నెల 19 నుండి విడతల వారీగా 27 వరకు నోటీసులు ఇచ్చిన వారిని విచారణకు పిలుస్తామన్నారు. మహిళా నటులు తమ కార్యాలయానికి రావడం ఇష్టం లేకుంటే వారి వద్దకే వెళ్లి విచారిస్తామన్నారు. ఎవరి పేర్లు తాము వెల్లడించలేదని స్పష్టం చేశారు. అందరికీ నోటీసులు అందాయన్నారు.
కాగా, తన తల్లి రెండు నెలల క్రితం చనిపోయారని అప్పట్లోనే సెలవు కోసం అప్లై చేయగా ప్రభుత్వం ఇప్పుడు అనుమతించిందని చెప్పారు. తాను సెలవుపై వెళ్లటం వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని చెప్పారు. లాండ్ అండ్ ఆర్డర్ సహకారం కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు.